Kishan Reddy: బీసీలకు న్యాయం చేయడం కన్నా..గాంధీ కుటుంబ అనుగ్రహం కోసమే పాట్లు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:58 AM
జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేసిన ధర్నాలో బీసీలకు న్యాయం చేయడం కన్నా గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలనే తపన సీఎం రేవంత్ రెడ్డిలో అధికంగా కనిపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రేవంత్ ప్రసంగంలో రాహుల్, సోనియా జపమే
మోదీని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేసిన ధర్నాలో బీసీలకు న్యాయం చేయడం కన్నా గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలనే తపన సీఎం రేవంత్ రెడ్డిలో అధికంగా కనిపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50ు కంటే ఎక్కువగా రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని విమర్శించారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడంలేదని, ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని బీసీలకు హామీ ఇచ్చినట్లుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వస్తుందని తెలిసే బీసీల పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. అశాస్త్రీయమైన సర్వే చేసి ముస్లింలకు 10ు రిజర్వేషన్లు కల్పించి బీసీలకు అన్యాయం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముస్లింలు 50 రిజర్వ్‌డ్ సీట్లలో పోటీ చేసి 31 స్థానాలు గెలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్.. మజ్లిస్ చెప్పినట్లు ఆడుతోందని ఆరోపించారు. నెహ్రూ హయాంలో కాకా కాలేకర్ కమిషన్, ఇందిర హయాంలో మండల్ కమిషన్ నివేదికలను విస్మరించింది కాంగ్రెస్సేనని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మివేసినట్లేనని, మరో 30 సంవత్సరాల వరకూ కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో రాదని ఆయన అన్నారు. తెలంగాణలో నడిచేది ఇందిరమ్మ పాలన కాదని, బకాయిల పాలన కొనసాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు బకాయిగా ఉన్న రూ.600 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.