BJP: ప్రభుత్వాలు మారినా.. పాలన మారలే
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:31 AM
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. పాలన మాత్రం మారలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. పాలన మాత్రం మారలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో విసుగు చెందిన ప్రజలు.. మార్పు కోసం కాంగ్రె్‌సను గెలిపిస్తే.. ఈ ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్ విధానాలనే అనుసరిస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 14 నెలలైనా ఇప్పటికీ ప్రజలు, కార్మికులు, రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎంలు మారినా పాలన మాత్రం అదే విధంగా ఉందని విమర్శించారు.