Share News

Kishan Reddy: సింగరేణిలో పొదుపు మంత్రం

ABN , Publish Date - May 30 , 2025 | 05:28 AM

సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తకుండా బొగ్గు ఉత్పాదక ఖర్చు గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy: సింగరేణిలో పొదుపు మంత్రం

  • సంస్థ పరిరక్షణకు తప్పవన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

  • సింగరేణి, కోల్‌ ఇండియా భవితవ్యంపై సమీక్ష

హైదరాబాద్‌/ గోదావరి ఖని, మే 29 (ఆంధ్రజ్యోతి): సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తకుండా బొగ్గు ఉత్పాదక ఖర్చు గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కార్మిక సంఘాల సహకారం తీసుకుని, సంస్థలో పని సంస్కృతిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. సింగరేణితోపాటు కోల్‌ ఇండియా సంస్థల పురోగతికి బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, బొగ్గు పంపిణీలో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ విషయమై ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఆయా సంస్థల పనితీరుపై సమీక్షించారు.


భవిష్యత్తులో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధనకు డిమాండ్‌కనుగుణంగా ప్రభుత్వ బొగ్గు సంస్థలు సమయాత్తం కావాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి వ్యయం తగ్గింపునకు బొగ్గు గని మంత్రిత్వశాఖ, సింగరేణి అధికారులతో కమిటీ వేయాలని హితవు చెప్పారు. ఈ కమిటీ ప్రత్యక్షంగా బొగ్గు గనుల్లో క్షేత్రస్థాయిలో కార్మికుల పనితీరు, తదితర అంశాలను పరిశీలించి తగు సూచనలు చేస్తుందన్న మంత్రి కిషన్‌ రెడ్డి.. వాటిలో ఆచరణాత్మక సిఫారసులను అమలు చేసి ఉత్పత్తి ఖర్చు తగ్గించాలని పేర్కొన్నారు. వినియోగదారులు సింగరేణికి దూరం కాకుండా బొగ్గు ఉత్పత్తిలో నాణ్యతపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సింగరేణి తరపున వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంస్థ సీఎండీ ఎన్‌.బలరామ్‌.. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సంస్థ ప్రగతి, భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు.

Updated Date - May 30 , 2025 | 05:28 AM