Share News

Phone Tapping: సిట్‌ చేతికి శ్రవణ్‌రావు ఫోన్లు

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:20 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌ రావు.. ఫోన్‌ట్యాపింగ్‌ జరిగిందన్న సమయంలో తాను వినియోగించిన రెండు సెల్‌ఫోన్లను దర్యాప్తు అధికారులకు సమర్పించారు.

Phone Tapping: సిట్‌ చేతికి శ్రవణ్‌రావు ఫోన్లు

మూడోసారి విచారణకు హాజరైన శ్రవణ్‌ రావు

  • 2 ఫోన్లు దర్యాప్తు అధికారులకు అందజేత

  • పది గంటలకు పైగా సాగిన విచారణ

  • చాలా ప్రశ్నలకు మౌనమే సమాధానం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌ రావు.. ఫోన్‌ట్యాపింగ్‌ జరిగిందన్న సమయంలో తాను వినియోగించిన రెండు సెల్‌ఫోన్లను దర్యాప్తు అధికారులకు సమర్పించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు శ్రవణ్‌రావు మంగళవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. సిట్‌ అధికారులు ఆయన్ను ప్రశ్నించడం ఇది మూడోసారి. అయితే, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న తన రెండు సెల్‌ఫోన్లను శ్రవణ్‌రావు.. దర్యాప్తు అధికారి, జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరికి సమర్పించారు. మంగళవారం ఉదయం 11 గంటలప్పుడు విచారణకు హాజరైన శ్రవణ్‌రావును దర్యాప్తు అధికారులు పది గంటలకు పైగా వివిధ అంశాలపై ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు శ్రవణ్‌రావు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్టు తెలిసింది. కాగా, నాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఆయన సన్నిహితులు, వారితో తరచూ మాట్లాడేవారి ఫోన్‌ నెంబర్లను ట్యాపింగ్‌ నిమిత్తం ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు అందజేసిన విషయంపై దర్యాప్తు అధికారులు శ్రవణ్‌రావును ప్రశ్నించినట్టు తెలిసింది. వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్‌ చేసి వారిని బెదిరించి శ్రవణ్‌రావు, ప్రణీత్‌రావు పెద్దమొత్తంలో డబ్బు సంపాదించారనే ఆరోపణలపైనా ప్రశ్నించారని సమాచారం. అలాగే, హవాలా వ్యాపారులు, బంగారు ఆభరణాల వ్యాపారులకు సంబంధించిన ఫోన్లను ఎందుకు ట్యాప్‌ చేయించారు? ఆయా నెంబర్లను ప్రణీత్‌రావుకు మీరే ఇచ్చారా? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అని కూడా ప్రశ్నించారు.


ఆయా ప్రశ్నలకు శ్రవణ్‌రావు మౌనం వహించారని సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం మీ కార్యాలయం, ఇల్లు ఎందుకు ఇచ్చారు? పరికరాల కొనుగోలుకు సంబంధించి ఖర్చుపెట్టిన డబ్బు మీ సొంతమా? మరెవరైనా ఇచ్చారా? అనే ప్రశ్నలు వేస్తూ కొన్ని బ్యాంకు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహరంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులకు, మీకూ ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి? ఆ పెద్దల ఆదేశాల మేరకే మీరు ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? అనే ప్రశ్నలకూ శ్రవణ్‌ సరైన సమాధానాలివ్వలేదని తెలుస్తోంది. శ్రవణ్‌విచారణకు సహకరించని క్రమంలో.. విచారణ వివరాలను సుప్రీంకోర్టుకు తెలియజేసి ఆయనపై చట్టపరమైన చర్యలకు వెళ్లాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే, విచారణకు సహకరించని పక్షంలో తామే చర్యలు తీసుకుంటామనే విషయాన్ని ఓ దర్యాప్తు అధికారి శ్రవణ్‌రావుకు వివరించారని, ఆ తర్వాతే ఆయన కొద్దిగా సమాధానాలు చెబుతున్నారని అంటున్నారు. అయితే, పెద్దల పాత్ర విషయంలో మాత్రం శ్రవణ్‌రావు సహకరించడం లేదని సమాచారం.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 09 , 2025 | 04:20 AM