Kaleshwaram Project: కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్!
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:39 AM
కాళేశ్వరం కమిషన్ నివేదిక, దాని ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన అంశాలు, ఆ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.
ప్రాజెక్టు పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా.. తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నం
హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌తో కేసీఆర్ భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలపై చర్చ
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ నివేదిక, దాని ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన అంశాలు, ఆ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వీటిని తిప్పికొట్టేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం కీలక నేతలు హరీశ్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులతో ఎర్రవల్లిలోని ఫాంహౌ్‌సలో సమావేశమైనట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా.. నిలిచిపోయిన ఆ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకువచ్చేలా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ఈ సందర్భంగా కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.
న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని, ఇందుకు ఏయే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్న దానిపై పార్టీ నేతలకు గులాబీ బాస్ సూచనలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందంటూ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ తదితర అంశాలపై కూడా కేసీఆర్ సమాలోచన చేసినట్లు తెలిసింది. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, దాన్ని అధిగమించేందుకు ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్నదానిపై కూడా అధినేత సూచనలు చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టాల్సిన ప్రణాళికలపైనా కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటారని చెప్పినట్లు సమాచారం.