Bhatti: ఇంజనీర్లు కడితే బ్యారేజీలు దెబ్బతినేవి కాదు
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:45 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇంజనీర్ల సూచనల మేరకు నిర్మించి ఉంటే దెబ్బతినేవి కాదని, కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తి తప్పుడు పద్ధతుల్లో కట్టడం వల్లే లక్ష కోట్లు ఖర్చు చేసినాఆ ప్రాజెక్టు ఎందుకూ కొరగాకుండాపోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు.
కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తడం వల్లే కొరగాకుండాపోయిన కాళేశ్వరం
కాంగ్రెస్ హయాంలో కట్టిన ఏ ప్రాజెక్టూ దెబ్బతినలేదు: డిప్యూటీ సీఎం భట్టి
భూపాలపల్లి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇంజనీర్ల సూచనల మేరకు నిర్మించి ఉంటే దెబ్బతినేవి కాదని, కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తి తప్పుడు పద్ధతుల్లో కట్టడం వల్లే లక్ష కోట్లు ఖర్చు చేసినాఆ ప్రాజెక్టు ఎందుకూ కొరగాకుండాపోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు. భూపాలపల్లి జిల్లా చెన్నాపూర్ వద్ద నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను భట్టి ప్రారంభించారు.
అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదిక వద్ద మంజూర్‌నగర్, నవాబుపేట, ధర్మారావుపేటలో రూ.7.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన విద్యుత్ సబ్ స్టేషన్లకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, జూరాల, నాగర్జున సాగర్ వంటి ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరకుండా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం సరైన ఇంజనీరింగ్ పద్ధతులను అనుసరించకపోవటంతో లక్ష కోట్లు గోదాట్లో పోసినట్లయిందని విమర్శించారు.