KCR Emerges: ఫాంహౌస్ వీడి.. పబ్లిక్‌లోకి
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:19 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు.
నేడు బీఆర్‌ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్
చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్.. శనివారం రాత్రే నందినగర్ నివాసానికి
నేటి సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి, పోలవరం-నల్లమల సాగర్‌పై చర్చ
ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగే బీఆర్‌ఎస్ సంయుక్త సమావేశానికి హాజరయ్యేందుకుగాను శనివారం రాత్రి ఫాంహౌ్‌సను వీడి.. నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫాంహౌ్‌సకు వెళ్లిపోవడం తెలిసిందే. అదే సందర్భంలో కాలుజారి పడి ప్రమాదం జరగడంతో చికిత్స అనంతరం కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అడపా దడపా ఆయనను ఫాంహౌస్‌లోనే కలిసేవారు. వారినుద్దేశించి కేసీఆర్ పొడిపొడిగానే మాట్లాడేవారు. అలా వార్తల్లో కనిపించని వ్యక్తిగా మారిపోయారు. తిరిగి ఈ ఏడాది జూలైలో అనారోగ్యం పాలుకావడంతో పూర్తిగా ఫాంహౌ్‌సకే పరిమితమయ్యారు.
తనను కలిసే నేతలతో మాట్లాడడమే తప్ప.. పబ్లిక్ మీటింగ్‌లకు, పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాలకు హాజరు కావడంలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బయటకు వచ్చారు. ఆదివారం (21న) బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశముంది. వాస్తవానికి ఈ సమావేశాన్ని ఈ నెల 19నే నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, పార్లమెంటు సమావేశాలు 19 వరకు కొనసాగడంతో... పార్టీ ఎంపీలు రాలేకపోతారన్న ఉద్దేశంతో 21వ తేదీకి వాయిదా వేశారు. చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తుండడం, పైగా కేసీఆర్ పాల్గొంటుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
పలు కీలక అంశాలపై చర్చ..
బీఆర్‌ఎస్ సంయుక్త సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్‌తోపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా చర్చించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలతో సర్దుకు పోవాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తాము 90 టీఎంసీల కోసం పోరాడామని, ఇప్పుడు 45 టీఎంసీలతోనే ఎలా సర్దుకుంటారని ప్రశ్నిస్తోంది. ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశంలోనే దీనిపై లోతుగా చర్చించి, కార్యాచరణను ప్రకటించే అవకాశముంది.
అయితే.. ఉద్యమ కార్యాచరణ తేదీలను మాత్రం ప్రకటించకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉండడమే ఇందుకు కారణం. మునిసిపల్ ఎన్నికలతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మధ్యలో వీటికి షెడ్యూలు వెలువడితే.. ఉద్యమ కార్యాచరణ తేదీలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కార్యాచరణ తేదీలను ప్రకటించడం లేదని సమాచారం. కాకపోతే.. ఎలాంటి ఉద్యమం చేపట్టాలన్న దానిపై సమావేశం చర్చిస్తుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాలప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించనున్నారు. పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదుపైనా చర్చ జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Kodad Remand Case: రిమాండ్ ఖైదీ మృతి ఘటనలో
President Droupadi Murmu: ఆధ్యాత్మికతే మానవాళికి దిక్సూ