Share News

Kodad Remand Case: రిమాండ్‌ ఖైదీ మృతి ఘటనలో

ABN , Publish Date - Dec 21 , 2025 | 07:27 AM

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రిమాండ్‌ ఖైదీ కర్ల రాజేష్‌ మృతి ఘటనలో సీఐ, ఎస్సైలపై పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు.

Kodad Remand Case: రిమాండ్‌ ఖైదీ మృతి ఘటనలో

  • కోదాడ రూరల్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు

  • ఎస్పీ కార్యాలయానికి చిలుకూరు ఎస్సై సురేష్‌ రెడ్డి అటాచ్‌

  • బీసీ అయినందునే సీఐపై చర్యలు: మంద కృష్ణమాదిగ

కోదాడ రూరల్‌, కోదాడ టౌన్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రిమాండ్‌ ఖైదీ కర్ల రాజేష్‌ మృతి ఘటనలో సీఐ, ఎస్సైలపై పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. కోదాడ రూరల్‌ సీఐ ప్రతాపలింగంను సస్పెండ్‌ చేయగా.. చిలుకూరు ఎస్సై సురేష్‌రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ శుక్రవారం అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు కొట్టడంతోపాటు వేధించడం వల్లే హుజూర్‌నగర్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న రాజేష్‌ గత నెలలో మృతి చెందాడంటూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాజేష్‌ మృతికి కారకులైన పోలీసులను సస్పెండ్‌ చేయాలంటూ కొద్ది రోజులుగా ఎమ్మార్పీఎస్‌ ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా దళిత యువకుడు కర్ల రాజేష్‌ మృతి ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న శాఖాపరమైన చర్యల్లో వివక్ష చూపార ని మంద కృష్ణమాదిగ ఆరోపించారు. శనివారం కోదాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజేష్‌ మృతిలో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్సై సురే్‌షరెడ్డి అన్నారు. ఆయన రెడ్డి కులస్థుడు కావడంతోనే కేవలం ఎస్పీ ఆఫీ్‌సకు అటాచ్‌ చేసి బీసీ అయిన సీఐ ప్రతాపలింగంను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. రాజేష్‌ కేసుకు సంబంధించిన వారందరిపై కులాలు, మతాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని తాము డీజీపీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.


ఎస్కార్ట్‌ వచ్చిన వారిపై కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన ఎస్పీ, డీఎస్పీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యే ప్రత్యక్ష భాగస్వామిగా ఉన్నారని, దళితుల ప్రాణాలు అంటే ఆమెకు అంత చౌకగా కనిపిస్తున్నాయా అని మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఈ ఉదంతంపై ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాజేష్‌ మృతి కేసులో బాధ్యులైన వారందరిపై హత్యానేరం మోపి, అట్రాసిటి కేసు నమోదు చేసి సర్వీస్‌ నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తాము రోడ్డు ఎక్కి తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Dec 21 , 2025 | 07:29 AM