Share News

Kavitha: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేదాకా పోరు

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:42 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు వెనక్కి తగ్గేదిలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.

Kavitha: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేదాకా పోరు

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు వెనక్కి తగ్గేదిలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో బీసీ కులాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బీసీ సంఘాలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమ కార్యాచణ రూపొందిస్తామని తెలిపారు.


బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయకుండా బీసీలను కాంగ్రెస్‌ మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్‌ చేశారు.


వి.ప్రకాశ్‌.. నోరు అదుపులో పెట్టుకో లేకుంటే దాడులు తప్పవు: జాగృతి నేతలు

ఎమ్మెల్సీ కవితపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న వి.ప్రకాశ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే దాడులు తప్పవని తెలంగాణ జాగృతి నాయకులు హెచ్చరించారు. సోమవారం జాగృతి కార్యాలయంలో శ్రీకాంత్‌గౌడ్‌, ఇతర నాయకులు మాట్లాడారు. క్వాంటమ్‌, ఆమ్‌వేల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర ప్రకాశ్‌దని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిలో ఆయనకూ భాగస్వామ్యం ఉందని, జలవనరుల నిర్వహణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆయన వాటా ఎంతో చెప్పాలని నిలదీశారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెల్లిపై అవాకులుపేలితే కేటీఆర్‌ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. కవితపై కొందరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై కేటీఆర్‌ స్పందించాలని కోరారు.

Updated Date - Sep 09 , 2025 | 04:42 AM