Share News

Kavitha Suspension Sparks Controversy: కవిత సస్పెన్షన్‌ దుర్మార్గం

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:34 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేయడంపై జాగృతి శ్రేణులు మండిపడుతున్నాయి...

Kavitha Suspension Sparks Controversy: కవిత సస్పెన్షన్‌ దుర్మార్గం

  • చాలా రోజులుగా పార్టీలో ఆమెపై కుట్ర

  • నమ్మకద్రోహులను పక్కన పెట్టుకొని..పార్టీ కోసం శ్రమించిన కవితపై చర్యలా?

  • వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదు

  • మండిపడుతున్న జాగృతి శ్రేణులు

  • హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేయడంపై జాగృతి శ్రేణులు మండిపడుతున్నాయి. సస్పెన్షన్‌ సమాచారం తెలిసిన వెంటనే మంగళవారం పలువురు కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ‘కేసీఆర్‌ నాయకత్వం వర్థిల్లాలి.. ఖబడ్దార్‌ హరీశ్‌రావు’ అంటూ నినాదాలు చేశారు. పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపిన కవితను సస్పెండ్‌ చేయడమేంటని వారు తప్పుబట్టారు. కవిత చేసిన వ్యాఖ్యలపై కనీసం వివరణ కూడా కోరలేదని మండిపడ్డారు. కొందరి కళ్లలో ఆనందం కోసమే సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. చాలా రోజులుగా పార్టీకి, కేసీఆర్‌కు కవితను దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. నమ్మక ద్రోహులను పక్కన పెట్టుకొని.. ఉద్యమకాలం నుంచి బీఆర్‌ఎస్‌ అభివృద్ధి కోసం పనిచేసిన కవిత పట్ల పార్టీ వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. కాగా, ఒక మహిళా నేత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని జాగృతి మహిళా నేతలు అన్నారు. కూతురును లిక్కర్‌ కేసులో, కొడుకును ఈ-రేసు కేసులో, ఇప్పుడు తండ్రిని కాళేశ్వరం కేసులో ఇరికించి.. హరీశ్‌రావు ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. గతంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద టపాసులు పేల్చిన ఓ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. జాగృతి వర్గాలు తగులబెట్టాయంటూ దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. తమ నాయకురాలిపై, జాగృతి సంస్థపై తప్పుడు ప్రచారాలు చేయడం తగదని, ఈ చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.


వారి సంతోషం కోసం కవిత సస్పెన్షన్‌..

పార్టీలో కుట్రలకు పాల్పడుతున్నారని కవిత ఆరోపిస్తే.. వారిని పక్కన పెట్టుకొని కవితను సస్పెండ్‌ చేయడం దుర్మార్గమని జాగృతి ఎంబీసీ, సంచారజాతుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ అన్నారు. హరీశ్‌రావు., సంతో్‌షరావు, జగదీశ్‌రెడ్డి లాంటి కొంతమంది వ్యక్తుల సంతోషం కోసం కవిత గొంతు కోశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి సామాజిక చైతన్యం తెచ్చిన కవిత పట్ల ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ నిర్ణయం ఏకపక్షమని, దీనిని తెలంగాణ సమాజం తరఫున తాము ఖండిస్తున్నామని జాగృతి నేత సయ్యద్‌ ఇస్మాయిల్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ కూడా చేయలేనన్ని కార్యక్రమాలు జాగృతి చేసిందని, కేసీఆర్‌పై జరుగుతున్న కుట్రలను ఖండిస్తూ.. రక్షణ కవచంలా కవిత పోరాడారని తెలిపారు. అలాంటి కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని చూస్తే.. బీఆర్‌ఎస్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తోందన్నారు.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 04:34 AM