Kavitha Suspended from BRS: పుట్టిల్లు పొమ్మంది
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:26 AM
కొన్నాళ్లుగా ఊహిస్తున్నదే జరిగింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన కన్నకూతురు, పార్టీ ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆమెపై ఈ చర్య తీసుకున్నట్లు బీఆర్‌ఎస్ ...
బీఆర్‌ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు
ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు
కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి
సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్‌ఎస్
కవితను ఉపేక్షిస్తే మరికొందరు గళం విప్పే ప్రమాదం
కేసీఆర్‌కు చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు
బహిష్కరణ అనుకుని చివరికి సస్పెన్షన్‌కే పరిమితం
బహిష్కరిస్తే ఆరేళ్లు తిరిగి రాకుండా పార్టీ నిబంధనలు
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొన్నాళ్లుగా ఊహిస్తున్నదే జరిగింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన కన్నకూతురు, పార్టీ ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆమెపై ఈ చర్య తీసుకున్నట్లు బీఆర్‌ఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో కవిత వ్యవహార శైలి, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్‌ఎ్‌సకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపింది. పార్టీ అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అందుకే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. సోమవారం రాత్రే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని భావించారు. సోమవారం మీడియా సమావేశంలో హరీశ్‌రావు, సంతో్‌షరావులు అవినీతి అనకొండలంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి వారిద్దరే కారణమని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు బీఆర్‌ఎ్‌సలో తీవ్ర కలకలం రేపాయి. కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సోమవారమే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. కవిత తీరుతో పార్టీకి జరిగే నష్టాన్ని కేసీఆర్‌కు వివరించారు. ఆమెతో పార్టీకి ఏమైనా లాభం ఉందా? అని కేసీఆర్ వారిని అడిగినట్లు సమాచారం. లాభం సంగతి అటుంచితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతోందని నేతలంతా కేసీఆర్‌కు వివరించారు. పార్టీ నుంచి ఆమెను సాగనంపాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, కేసీఆర్ వెంటనే ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. మంగళవారం ఉదయం మరోమారు ఫామ్‌హౌజ్‌లోనే కీలక నేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు కవిత అంశంపైనే సుదీర్ఘంగా చర్చించారు. వేటు వేస్తే లాభనష్టాలపై బేరీజు వేసుకున్నారు. కవితను సస్పెండ్ చేయని పక్షంలో అనేక మంది పార్టీలో ఉంటూ పార్టీకే నష్టం కలిగించేలా వ్యవహరిస్తారనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
దాంతో కేసీఆర్ తన తనయపై వేటుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో సస్పెన్షన్ ప్రకటన వెలువడింది. తొలుత ఏకంగా బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అదే ప్రకటనను సిద్ధం చేశారు కూడా. తర్వాత అధికారిక ప్రకటనలో సస్పెన్షన్‌గా మార్చారు. బీఆర్‌ఎస్ పార్టీ నిబంధనావళి ప్రకారం పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆరేళ్ల పాటు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు. సస్పెన్షన్ చేస్తే ఏ క్షణమైనా ఎత్తేసి తిరిగి పార్టీలోకి తీసుకోవచ్చు. మరోవైపు కవితే బుధవారం బీఆర్‌ఎ్‌సకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు జాగృతి వర్గాలు వెల్లడించాయి.
సస్పెండ్ తర్వాత బీఆర్‌ఎస్ ఎదురు దాడి
హరీశ్‌రావు, సంతోషరావులపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా సంయమనం పాటించాలని పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అధినేత ఏదో ఒక నిర్ణయం తీసుకొనే వరకు ఆమె వైఖరిపై స్పందించొద్దని సందేశాలు అందాయి. మంగళవారం మధ్యాహ్నం సస్పెన్షన్ ప్రకటన వెలువడగానే బీఆర్‌ఎస్ నేతలంతా కవితపై మాటల దాడితో విరుచుకుపడ్డారు. కొందరు నేతలు నేరుగా మీడియాతో మాట్లాడారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఆమెపై మాటల దాడి మొదలెట్టారు. కన్న కూతురు కంటే కార్యకర్తలే ముఖ్యమని, పేగుబంధం కంటే పార్టీలో ఉన్న అనుబంధమేముఖ్యమని, పార్టీకి డ్యామేజ్ చేసే వారికంటే ఇమేజ్ పెంచే నాయకులే ముఖ్యమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరూపించారంటూ సోషల్ మీడియా వేదికగా హోరెత్తించారు. కవిత సస్పెన్షన్‌ను హర్షణీయమని, స్వాగతిస్తున్నామని, ఆమె ఉంటే ఎంత పోతే ఎంత? అంటూ మహిళా నేతలంతా తెలంగాణ భవన్ వేదికగా మాట్లాడారు.
కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కవిత సస్పెన్షన్‌ను స్వాగతించిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఉన్న నేతలంతా ఎక్కడికక్కడ స్పందించారు. కవిత సస్పెన్షన్ తీరుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఈటల రాజేందర్ విషయంలో కఠినంగా వ్యవహరించి, ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేసుకుంటున్నారు. కవితకు ఒక న్యాయం, ఈటలకు ఒక న్యాయమా? అంటూ కొందరు నేతలు అధిష్ఠానం తీరును అంతర్గతంగా తప్పుబడుతున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత ఇంకా ఎక్కువగా వ్యక్తిగత లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసే ప్రమాదం లేకపోలేదని కొందరు నేతలంటున్నారు. సస్పెన్షన్‌తో సరిపెట్టుకోకుండా హరీశ్‌రావు, సంతోశ్‌రావులపై చేసిన అవినీతి ఆరోపణలను పార్టీ పెద్దలుఎందుకు ఖండించడం లేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కవిత సస్పెన్షన్ నిర్ణయం పార్టీకి తాత్కాలికంగా మేలు కలిగించే అంశమైనప్పటికీ దీర్ఘకాలికంగా జరిగే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ సొంతింటిని చక్కదిద్దుకోలేక పోయారని, కుటుంబ సభ్యులను కట్టడి చేయలేక పోయారన్న నిందను ఎప్పటికీ మోయాల్సి వస్తుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..