Share News

Kavitha: స్వర్ణకారులూ ఆత్మహత్యలు చేసుకోవద్దు

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:00 AM

ఇటీవల కాలంలో స్వర్ణకారులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Kavitha: స్వర్ణకారులూ ఆత్మహత్యలు చేసుకోవద్దు

  • 8 411 చట్ట సవరణకు పోరాటం: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల కాలంలో స్వర్ణకారులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. తన నివాసంలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని, కాంగ్రెస్‌ కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం స్వర్ణకారులతోపాటు అన్ని చేతివృత్తులవారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు.


తెలంగాణతోపాటు ఏపీలోనూ 411 చట్టం కింద కేసులు పెట్టి స్వర్ణకారులను వేధించడం తగదన్నారు. స్వర్ణకారులను వేధింపులకు గురిచేస్తున్న 411 చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకురాలిగా ఈ చట్టం సవరణ కోసం పోరాడుతానన్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకోవడం తగదని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలన్నారు. అదేవిధంగా కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధిస్తున్నారని, అలాంటి నకిలీలు ఇబ్బంది పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - Jul 08 , 2025 | 05:00 AM