KTR: ‘రామన్న’.. మాట వెనుక మతలబేంటి!
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:13 AM
గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత అన్నారు. అప్పుడు ఆ వాఖ్య సంచలనంగా మారింది. ఆ దయ్యాల్లో కేటీఆర్ కూడా ఉన్నారని కొన్ని పత్రికలు రాశాయి.
గతంలో కేటీఆర్‌పై పలు ఆరోపణలు
ఇప్పుడు రామన్న అంటూ కవిత ప్రస్తావన
నాన్న కేసీఆర్‌ను బాగా చూసుకోవాలంటూ జాగ్రత్తలు.. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ
రెండ్రోజుల్లో జిల్లాల వారీగా జాగృతి నేతలు, కార్యకర్తలతో భేటీలు
కేసీఆర్ ఫొటోతో సొంత పార్టీ దిశగా కవిత పయనం!
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత అన్నారు. అప్పుడు ఆ వాఖ్య సంచలనంగా మారింది. ఆ దయ్యాల్లో కేటీఆర్ కూడా ఉన్నారని కొన్ని పత్రికలు రాశాయి. సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. టీవీ చానళ్లల్లోనూ చర్చ జరిగింది. అయితే ఆ రాతలను, చర్చలను ఎప్పుడూ, ఎక్కడా కవిత ఖండించలేదు. కేటీఆర్‌ను ఉద్దేశించి ఆరోపణలూ చేశారు. బీఆర్‌ఎస్ నుంచి తన సస్పెన్షన్ జరిగిన తరువాత బుధవారం విలేకరుల సమావేశంలో మాత్రం కేటీఆర్‌ను ‘రామన్న’ అంటూ కవిత సంబోధించారు. హరీశ్, సంతో్‌షరావులపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె కేటీఆర్‌పై ఎలాంటి ఆరోపణలు చే యకపోవడం గమనార్హం. తండ్రి కేసీఆర్‌ను బాగా చూసుకోవాలంటూ జాగ్రత్తలు చెప్పారు. కవిత చేసిన ఈ వాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అన్ని విషయాలను ఇప్పుడే బయటపెట్టేస్తే ఇంతటితో చల్లారిపోతుందని అనుకున్నారా? లేదంటే కవిత మాటల వెనుక ఇంకా పెద్ద మతలబు ఏమైనా ఉందా? అన్నదానిపై చర్చ నడుస్తోంది.
కాగా సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సొంత పార్టీ పెట్టినా తన తండ్రి కేసీఆర్ ఫొటోను మాత్రం పార్టీ కార్యకలాపాల్లో వాడనున్నారని తెలుస్తోంది. రెండ్రోజుల తరువాత జాగృతి నాయకులు, కార్యకర్తలతో కవిత జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే బహుజన నాయకులు, మేధావులతోనూ మాట్లాడనున్నారు. సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాల మేరకు పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ‘సామాజిక తెలంగాణ’ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రధానంగా గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్ హయాంలో విస్మరణకు గురయ్యా మని బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలను భాగస్వామ్యం చేయాలని కవిత నిర్ణయించుకున్నట్టు సమాచారం.