Share News

Kavitha: బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు

ABN , Publish Date - Feb 16 , 2025 | 03:39 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒకే బిల్లు ప్రవేశపెడితే సరిపోదని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలకు వేర్వేరుగా మూడు బిల్లులు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Kavitha: బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు

  • విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలకు వేర్వేరుగా పెట్టాలి

  • తప్పుల తడకగా కులగణన సర్వే

  • సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించింది బీఆర్‌ఎస్సే: కవిత

ఖమ్మం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒకే బిల్లు ప్రవేశపెడితే సరిపోదని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలకు వేర్వేరుగా మూడు బిల్లులు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ విషయంలో బీసీ వర్గాలను చైతన్యం చేసేందుకు తెలంగాణ జాగృతి పని చేస్తుందని ప్రకటించారు. ఖమ్మంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం, స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జరిగిన సేవాలాల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసం వద్ద విలేకరులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్‌పై ఒకే బిల్లుపెడితే విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లపై కోర్టుల్లో ఇబ్బందులు ఎదురై రిజర్వేషన్‌ అమలు నిలిచిపోయే అవకాశం ఉందని అన్నారు.


బీసీ జనాభా 46శాతం ఉన్నందున వారికి 46 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లు పెట్టడమే కాక, అదే రోజున ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్‌ గాంధీ చెప్పినందున చట్టసభల్లో దానిని అమలు చేసి విద్య, ఉద్యోగాల్లో మాత్రం 46 శాతం అమలు చెయ్యాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మైనార్టీలకు వేరుగా రిజర్వేషన్‌ అమలు చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లలో మైనారిటీలను ఎలా కలపుతారని బీజేపీ నేతలు అనడం సరికాదన్నారు. ఇక, కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు. కులగణన తప్పులతడకగా సాగిందని, గ్రామాల వారీగా ఏ కులంలో ఎంత జనాభా ఉందో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సేవాలాల్‌ జయంతిని తొలిసారి అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని కవిత పేర్కొన్నారు.

అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టేందుకు చంద్రబాబు యత్నం

గోదావరి, కృష్ణా జలాల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరించడం లేదని కవిత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు అనుమతులు లేకుండా గోదావరి జలాలను వాడుకునేందుకు ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..

Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Feb 16 , 2025 | 03:39 AM