Share News

Narayanpur Reservoir: నారాయణపూర్‌ నుంచి జూరాలకు 4 టీఎంసీలు

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:39 AM

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో నారాయణపూర్‌ జలాశయం నుంచి 4 టీఎంసీలు విడుదల చేయడానికి కర్ణాటక సర్కారు అంగీకరించింది.

Narayanpur Reservoir: నారాయణపూర్‌ నుంచి జూరాలకు 4 టీఎంసీలు

  • తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో అంగీకరించిన కర్ణాటక

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో నారాయణపూర్‌ జలాశయం నుంచి 4 టీఎంసీలు విడుదల చేయడానికి కర్ణాటక సర్కారు అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ప్రతినిధుల బృందం బుధవారం కర్ణాటక వెళ్లింది. బెంగళూరులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు, తాగునీటి అవసరాలను వివరించి నారాయణపూర్‌ నుంచి జూరాల జలాశయానికి నీరు వదలాలని కోరింది. పాలమూరు జిల్లా వరప్రదాయని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో వేగంగా నీటి నిల్వలు పడిపోతున్నాయని తెలిపింది. వేసవి సమీపిస్తుండటంతో నారాయణపూర్‌ జలాశయం నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల జూపల్లి, శ్రీధర్‌బాబు కోరారు.


ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1.7 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, పరిస్థితి ఇలాగే ఉంటే డెడ్‌ స్టోరేజీకి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల్‌, వనపర్తి, కొల్లాపూర్‌, దేవరకద్ర, మక్తల్‌ నియోజకవర్గాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. 30 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు మీదే ఆధారపడి ఉన్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై డీకే శివకుమార్‌ సానుకూలంగా స్పందించి... 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. గత సంవత్సరం తాగునీటి ఎద్దడి ఏర్పడగా 1.90 టీఎంసీలను నారాయణపూర్‌ నుంచి జూరాలకు విడుదల చేశారు. ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే ఉండటంతో నారాయణపూర్‌ నుంచి 5 టీఎంసీలతో పాటు తుంగభద్ర డ్యాం నుంచి నదికి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని తెలంగాణ కోరింది. తుంగభద్రకు నీటి విడుదలపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..

Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..

Updated Date - Feb 06 , 2025 | 03:40 AM