Share News

కొత్త పథకాలు అమలయ్యేనా?

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:07 AM

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కోసం లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ మూడు పథకాలు నిలిచిపోనున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న కొత్తగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించింది.

కొత్త పథకాలు అమలయ్యేనా?

జగిత్యాల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కోసం లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ మూడు పథకాలు నిలిచిపోనున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న కొత్తగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. ఇందులో రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ కూడా అందజేశారు. కానీ ఎన్నికల కోడ్‌ రావడంతో నిబంధనల ప్రకారం రైతు భరోసా మినహా మిగతా మూడు పథకాలు నిలిచిపోనున్నాయనే చర్చ జరుగుతోంది.

ఫజిల్లాలో 72,686 దరఖాస్తులు

ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డుల మంజూరు కోసం ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు తీసుకుంది. దీనికి తోడు అర్హుల జాబితాలో పేర్లు లేని వారు గత నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తు చేసు కున్నారు. జిల్లా వ్యాప్తంగా 72,686 దరఖాస్తులు వచ్చాయి. గ్రామసభలు ముగిసి పది రోజులు గడుస్తున్నా ఆ దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదుపై స్పష్టత రావడం లేదు. దీనికి తోడు కొత్త పథకాలకు బ్రేక్‌ పడనుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం 19,708 దరఖాస్తులు, రేషన్‌కార్డులకు 27,858, రేషన్‌కార్డుల్లో మార్పుల కోసం 14,101, రైతు భరోసాకు 1,077 ఆత్మీయ భరోసాకు 9,942 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను మండల, జిల్లా కార్యాలయాలకు పంపకుండా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే ఉంచారు.

ఫమార్గదర్శకాలు లేకపోవడంతోనే..

గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహించిన సమయంలో దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసి అర్హులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తామని అధికారం యంత్రాంగం ప్రకటించింది. కానీ ప్రస్తుతం దరఖాస్తుల ఆన్‌లైన్‌పై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడలేదని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ చేసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారా లేదా అనే దానిపై వారి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. తమ దరఖాస్తులను కార్యాలయాల్లో చూసి తాము పథకాలకు అర్హులమో కాదోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఫదరఖాస్తుల పునః పరిశీలన

జిల్లాస్థాయి అధికారులు మౌళిక ఆదేశాలతో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను మాత్రం పంచాయతీ కార్యదర్శులు పునఃపరిశీలన చేసే ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తులను నాలుగు (ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 , ఎల్‌-4) కేటగిరీలుగా విభజించే పని పూర్తి చేశారు. ఇందులో ఎల్‌-1 కేటగిరీలోని సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వారి దరఖాస్తులను గుర్తించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు దరఖాస్తు చేసుకున్నవారు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పని దినాలు పూర్తి చేశారనే వివరాలు సేకరించారు. కొత్త రేషన్‌ కార్డులు, యూనిట్ల నమోదుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వెలువడకపోవడం గమనార్హం.

ఫపైలెట్‌ ప్రాజెక్టు కింద మండలానికో గ్రామం ఎంపిక

జిల్లాలో ఇప్పటి వరకు పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లోనే పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మిగతా గ్రామాలు, వార్డుల్లో అమలు విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. అర్హులందరికీ ఒకేసారి ఇస్తారా..? లేక విడతల వారీగా ఇస్తారా అనే దానిపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొదటి విడతలో ఇస్తామని చెప్పారు. మిగితా గ్రామాల్లో ఏ వర్గానికి ఎప్పుడు ఇస్తారనే విషయమై స్పష్టత లేక దరఖాస్తుదారులు అయోమయంలో ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించవద్దనే నిబంధన ఉంటుంది. అంతకుముందే ప్రారంభించిన పథకాలను అమలు చేస్తారన్న ఒక చర్చ, ఎన్నికల కోడ్‌ మార్చి 8వ తేదీన ముగుస్తుందని ఆ తర్వాతే అమలు చేస్తారన్న మరో చర్చ సాగుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే పథకాల అమలుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశాలున్నాయి.

Updated Date - Feb 05 , 2025 | 01:07 AM