Share News

లక్ష్యం నెరవేరేనా..?

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:07 AM

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఆశించిన లక్ష్యం నెరవేరేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యంలో 61శాతం మాత్రమే వసూలైంది. ఏ గ్రామ పంచాయతీ సైతం లక్ష్యానికి చేరువలో లేదు.

లక్ష్యం నెరవేరేనా..?

లక్ష్యం నెరవేరేనా..?

-జిల్లాలో రూ.12.48 కోట్ల పన్ను వసూళ్లు టార్గెట్‌

-ఇప్పటి వరకు 61 శాతం పూర్తి

-వివిధ సర్వే పనుల్లో కార్యదర్శులు బిజీ

-మార్చి31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం

-అధికారులు ప్రణాళికతో ముందుకు సాగితేనే ఆదాయం

జగిత్యాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఆశించిన లక్ష్యం నెరవేరేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యంలో 61శాతం మాత్రమే వసూలైంది. ఏ గ్రామ పంచాయతీ సైతం లక్ష్యానికి చేరువలో లేదు. మరో వైపు మార్చి31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. దీంతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారు. పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మల్లీ పర్పస్‌ ఉద్యోగులకు నెల వారీగా వేతనాల చెల్లింపు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అత్యవసర పనులకు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు వివిధ సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.

ఫఇప్పటి వరకు రూ.7.56 కోట్లు వసూలు

జిల్లాలోని 18 మండలాల్లో గత సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ యేడాది ఫిబ్రవరి 7వ తేదీ వరకు కేవలం 61 శాతం మాత్రమే పన్ను వసూలైంది. జిల్లా వ్యాప్తంగా రూ.12,48,85,209 పన్ను వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 7,56,28,157 వసూలు చేశారు. జిల్లాలో అత్యధికంగా కోరుట్ల మండలంలో 77 శాతం పన్ను వసూలు కాగా, అత్యల్పంగా ఇబ్రహీంపట్నం, బుగ్గారం మండలాల్లో 45 శాతం వసూలైంది. ఈఆర్థిక సంవత్సరానికి కేవలం 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరో వైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయితే పంచాయతీ అధికారులు, సిబ్బంది బిజీ కానున్నారు. ఈ లోపు పన్నుల వసూళ్లను వేగవంతం చేయాల్సిన అవసరముంది.

వంద శాతం లక్ష్యం సాధించడానికి చర్యలు

-గౌతమ్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యం సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పన్నుల వసూళ్లపై డీఎల్‌పీవోలు, ఎంపీవోల ద్వారా కార్యదర్శులకు తగిన సూచనలు చేశాం. మార్చి 31వ తేదీ వరకు వంద శాతం ట్యాక్స్‌ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. వసూలైన ట్యాక్స్‌ను అత్యవరాలకు వినియోగిస్తున్నాము.

Updated Date - Feb 08 , 2025 | 01:07 AM