Share News

నిర్మలమ్మ కరుణించేనా..?

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:45 AM

పార్లమెంట్‌లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లాకు నిధుల కేటాయింపుపై ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. నిజామాబాద్‌ జాతీయ పసుపు బోర్డుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది.

నిర్మలమ్మ కరుణించేనా..?

-పసుపు బోర్డుకు నిధుల కేటాయింపుపై ఆశలు

-ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రోత్సాహంపై ఎదురుచూపులు

-నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌

జగిత్యాల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లాకు నిధుల కేటాయింపుపై ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. నిజామాబాద్‌ జాతీయ పసుపు బోర్డుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది. పసుపు బోర్డు ఏర్పాటు అయినప్పటికీ తదుపరి ప్రక్రియలో భాగంగా బడ్జెట్‌ కేటాయింపులపై రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మల్లాపూర్‌ మండలం ముత్యంపేట నిజాం దక్కన్‌ షుగర్‌ లిమిటెడ్‌ కర్మాగారాన్ని ప్రారంభించాలనే డిమాండ్‌ ఉంది. వీటితో పాటు జిల్లాలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ, భారీ వస్తు తయారీ పరివ్రమలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ నవోదయకు నిధుల విడుదలకు ఎదురుచూపులు

జిల్లాకు ఇటీవల నవోదయ విద్యాలయాన్ని, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పాఠశాలల నిర్మాణాలకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించాల్సి ఉంది. అదేవిదంగా నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాల నిర్మాణాలకు, మౌలిక వసతులకు అవసరమైన నిధులు కేంద్రం బడ్జెట్‌లో మంజూరు చేయాల్సి ఉంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతం నుంచి హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలతో లింకు కలిపి పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేయాలని పలువురు వ్యాపారులు కోరుతున్నారు. జగిత్యాల వద్ద వస్తువుల తయారీ యూనిట్లను నెలకొల్పాలన్న డిమాండ్‌ ఉంది.

ఫజగిత్యాల-మంచిర్యాల రైల్వే లైన్‌పై ఆశలు

జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు కొత్తగా రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ రైల్వే లైన్‌ ఏర్పాటు డిమాండ్‌ ముందుకు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిజామాబాద్‌-ఆర్మూర్‌-కరీంనగర్‌- కాగజ్‌నగర్‌ లైన్‌లో రైళ్లు పెంచాలన్న డిమాండ్‌ ఉంది. అదేవిదంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, నిజామాబాద్‌ మీదుగా ముంబైకి రైళ్ల సంఖ్య పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల నుంచి నిజామాబాద్‌, మంచిర్యాల మీదుగా అయోధ్య, వారణాసికి వెళ్లేందుకు రైళ్లు నడిపించాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి వినిపిస్తోంది. ముంబాయి-కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రతీ రోజు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో పసుపు అధికంగా సాగవుతుండడంతో పసుపు రవాణాకు గూడ్స్‌ రైలు నడపాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు, రైతులు కోరుతున్నారు. మామిడి సాగులో జిల్లా ముందంజలో ఉంది. ప్రతీ యేటా జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి ప్రాంతాల్లో గల మామిడి మార్కెట్‌లలో సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఢిల్లీ, ముంబాయి, పుణే తదితర ప్రాంతాలకు చెందిన హోల్‌సెల్‌ వ్యాపారులు సీజన్‌లో జిల్లాకు వచ్చి మామిడిని కొనుగోలు చేసి పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇక్కడి నుంచి నేరుగా రైతులు ఇతర ప్రాంతాలకు మామిడిని రవాణా చేసి విక్రయించుకునేలా రైలు సదుపాయం కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఫజాతీయ రహదారుల విస్తరణకు నిధులు వచ్చేనా?

నిజామాబాద్‌ జిల్లా పెర్కిట్‌ నుంచి జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురిల మీదుగా మంచిర్యాల వరకు వెళ్తున్న జాతీయ రహదారిని ఫోర్‌లేన్‌ రహదారిగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి భూ సేకరణ పనులు నిర్వహిస్తున్నారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌ రహదారి విస్తరణ పనులు సైతం నత్తనడకలో సాగుతున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవ పర్యాయం అధికారం చేపట్టిన తదుపరి మోదీ 3.0 కార్యక్రమంలో భాగంగా ఈ రెండు రహదారులను చేర్చినప్పటికీ పలు కారణాల వల్ల తొలగించారు. జగిత్యాల-కరీంనగర్‌, పెర్కిట్‌-మంచిర్యాల జాతీయ రహదారుల విస్తరణకు అవసరమైన పూర్తి స్థాయి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేయాలన్న డిమాండ్‌ ఉంది.

Updated Date - Feb 01 , 2025 | 01:45 AM