Share News

సమీకృత మార్కెట్ల నిర్మాణాలకు మోక్షమెప్పుడో?

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:48 AM

జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణాలు పూర్తి కాక ప్రజలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా కూరగాయలు, మాంసాహారం అన్నీ ఒకే చోట విక్రయాలు జరపాలని సమీకృత మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కానీ ధర్మపురి మున్సిపాలిటీలో మినహా అంతటా పనులు పడకేశాయి.

సమీకృత మార్కెట్ల నిర్మాణాలకు మోక్షమెప్పుడో?

జగిత్యాల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణాలు పూర్తి కాక ప్రజలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా కూరగాయలు, మాంసాహారం అన్నీ ఒకే చోట విక్రయాలు జరపాలని సమీకృత మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కానీ ధర్మపురి మున్సిపాలిటీలో మినహా అంతటా పనులు పడకేశాయి. రాయికల్‌లో స్థలం అందుబాటులో లేకపోవడంతో నిర్మాణం ప్రారంభం కాకపోగా, మరికొన్ని చోట్ల పునాదులకు, గోడల నిర్మాణాలకే పరిమితమయ్యాయి. నిధులు సైతం పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో పలు చోట్ల పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో పట్టణాల్లో కూరగాయలు, మాంసం విక్రయాలు రోడ్లపైనే జరుగుతున్నాయి. సమీకృత మార్కెట్ల నిర్మాణాలను పూర్తి చేస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.

ఫజగిత్యాలలో పూర్తి కాని పనులు

జిల్లా కేంద్రమైన జగిత్యాలలో సమీకృత మార్కెట్‌ పనులు పూర్తి కాకపోవడంతో వినియోగదారులకు అందుబాటులోకి రావడం లేదు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి రూ.4.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తి కాలేదు. సమీకృత మార్కెట్‌లో నీటి సరఫరా, విద్యుత్‌ సౌకర్యం వంటి వసతులు కల్పించలేదు. ఇందుకోసం మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.35 లక్షల నిధులను ఇటీవల కేటాయించారు. ప్రస్తుతం పట్టణంలోని అంగడి బజార్‌, శ్రీరామ థియేటర్‌, ధర్మపురి బస్టాండు, కొత్త బస్టాండు, టవర్‌ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో కూరగాయల అమ్మకాలు, కొత్త బస్టాండు వద్ద చేపల అమ్మకాలు, పలు ప్రాంతాల్లో రహదారులపై మాంసం విక్రయాలు జరుగుతున్నాయి.

ఫమెట్‌పల్లిలో అర్ధంతరంగా నిలిచిన పనులు

మెట్‌పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్‌లో గల ఖాధీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌కు సమీపంలో రూ.10.50 కోట్ల నిధులతో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ మొదట వేగంగానే పనులు చేపట్టాడు. అనంతరం బిల్లులు సక్రమంగా రాకపోవడంతో పనులు నిలిపివేశాడు. దీంతో సమీకృత మార్కెట్‌ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. పట్టణంలోని పాత బస్టాండు, మార్కెట్‌ రోడ్డు, వెల్లుల్ల రోడ్డులో ఇరువైపులా కూరగాయలు, మాంసం విక్రయాలు జరుపుతున్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యుత్‌, మూత్రశాలలు, మంచినీటి వసతి లేకపోవడంతో రైతులు, వ్యాపారులు, వినియోగదారులు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ఫస్థల సేకరణలో ఇబ్బందులు

రాయికల్‌ పట్టణంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి స్థల సేకరణ సమస్యగా మారింది. స్థలాన్ని సేకరించడంలో అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు విఫలమయ్యారు. దీంతో ఇప్పటివరకు సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కాగా ప్రస్తుతం రాయికల్‌లోని ప్రధాన వీధిలో, పాత కూరగాయల మార్కెట్‌లో రహదారిపైనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. వారసంత సైతం రోడ్డుపైనే జరుగుతుండడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది.

ఫకోరుట్ల, ధర్మపురిలో మౌలిక వసతులు కరువు

కోరుట్ల పట్టణంలోని మార్కెట్‌ యార్డులో రూ.6.50 కోట్ల నిధులతో సమీకృత మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పట్టణంలోని కల్లూరు రోడ్డులో రూ.2 కోట్లతో అదనపు సమీకృత మార్కెట్‌ను సైతం నిర్మించారు. కల్లూరు రోడ్డులో నిర్మించిన సమీకృత మార్కెట్‌ ఉపయోగంలోకి వచ్చింది. కాగా మార్కెట్‌ యార్డులో నిర్మించిన సమీకృత మార్కెట్‌లో మౌలిక వసతులు లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా వినియోగంలోకి రాలేదు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించినప్పటికీ ఉత్సవ విగ్రహంలా సమీకృత మార్కెట్‌ మారింది. ప్రస్తుతం పట్టణంలోని వేములవాడ రోడ్డు వైపున కూరగాయల క్రయ విక్రయాలు, మాంసం విక్రయాలు, అంగడి కొనసాగుతోంది. ధర్మపురి పట్టణంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్ల నిధులతో సమీకృత మార్కెట్‌ నిర్మాణం చేపట్టారు. అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా మార్కెట్‌ను ప్రారంభం చేశారు. అయితే సమీకృత మార్కెట్‌ వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. పలు సదుపాయాలు లేకపోవడంతో అటు సమీకృత మార్కెట్‌లోనూ ఇటు ఇతర ప్రాంతాల్లోనూ కూరగాయలు, మాంసం క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.

Updated Date - Feb 26 , 2025 | 01:48 AM