అభివృద్ధిలో తోడుగా ఉంటాం
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:44 AM
స్మార్ట్‌సిటీ నిధులను సక్రమంగా వినియోగించుకొని కరీంనగర్ అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిపారు.. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి... మీరు ఒక అడుగు ముందుకు వేస్తే... మేము రెండు అడుగులు వేసి మీ అభివృద్ధికి తోడుగా ఉంటామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు.

- నిరంతర నీటి సరఫరా చారిత్రాత్మకం
- కరీంనగర్‌లో డంపింగ్ యార్డు ప్రక్షాళన చేస్తాం
- స్మార్ట్‌సిటీ నిఽధులతో అభివృద్ధిలో కరీంనగర్ ఆదర్శం
- కరీంనగర్‌పై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రశంసల జల్లు
కరీంనగర్ టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):స్మార్ట్‌సిటీ నిధులను సక్రమంగా వినియోగించుకొని కరీంనగర్ అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిపారు.. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి... మీరు ఒక అడుగు ముందుకు వేస్తే... మేము రెండు అడుగులు వేసి మీ అభివృద్ధికి తోడుగా ఉంటామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డంపింగ్‌యార్డును కేంద్రం నిధులతో ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన మల్టీపర్పస్ పార్కు, అంబేద్కర్ స్టేడియం స్పోర్ట్ప్ కాంప్లెక్సు, కుమార్‌వాడీ పాఠశాలలోని ఈక్లాస్ రూమ్స్‌ను ప్రారంభించిన అనంతరం హౌజింగ్‌బోర్డుకాలనీలో ప్రతిరోజూ నిరంతర నీటి సరఫరా (24/7) పైలెట్ ప్రాజెక్టుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మున్సిపల్‌కమిషనర్ చాహాత్ భాజ్‌పాయ్‌తో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కరీంనగర్‌పై, మంత్రి బండి సంజయ్‌కుమార్, మేయర్ సునీల్‌రావుతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఫ ఆకట్టుకున్న కేంద్రమంత్రి ఖట్టర్ తెలుగు ప్రసంగం :
నా ప్రియమైన కరీంనగర్ పౌరులారా నమస్తే అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్ 150 సెకన్ల పాటులో తెలుగు మాట్లాడుతూ ఆహుతులను కట్టిపడేశారు. నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం కల్పించినందుకు బండి సంజయ్ కుమార్‌కు ధన్యవాదాలు చెబుతున్నా. దేశంలోనే తెలంగాణ సుసంపన్నమైన రాష్ట్రం. ఎన్నో పోరాటాలకు నిత్య చైతన్యాలకు, త్యాగాలకు పురిటి గడ్డ ఈ కరీంనగర్ నేల..కరీంనగర్ ప్రజలు నిత్యం ఉత్సాహంతో కన్పిస్తారు. కష్టపడి పనిచేస్తున్న బండి సంజయ్‌ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా...పవిత్రమైన గోదావరి ప్రవహించే నేల ఉన్న కరీంనగర్. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ, కొండగట్టు పవిత్రమైన ఆలయాలున్న ఆధ్యాత్మికమైన భూమి కరీంనగర్. గొప్ప చరిత్ర కలిగిన జిల్లా కరీంనగర్ అంటూ రెండు నిమిషాలు తెలుగులోనే తొలి ప్రసంగం చేసి ఆహుతులను కట్టిపడేశారు.
ఫ పచ్చదనం.. పరిశుభ్రత భేష్:
నాలుగేళ్లలో దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని కుళాయి ద్వారా అందించడమే మా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని ఖట్టర్ పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు డివిజన్లో 4,050 ఇళ్లకు 24గంటల పాటు తాగునీటిని అందించాలనే ఆశయం నెరవేరడానికి అంకురార్పణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు ప్రారంభంలో భాగంగా 2,200 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని ప్రారంభించామని,. మిగతావి త్వరలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. దేశంలో ఇలా ఎక్కువ ఇళ్లకు ప్రతిరోజూ నిరంతరంగా తాగునీటిని అందిస్తున్న ఘనత కరీంనగర్ కార్పొరేషన్‌కే దక్కుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 100 కార్పొరేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్‌సిటీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కూడా స్మార్ట్ సిటీ నిధులను సమగ్రంగా వినియోగించుకుని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు. మిగతా పట్టణాలతో పోలిస్తే కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులు చాలా బాగా జరిగాయని, రోడ్ల చుట్టూ పచ్చదనం బాగుందని కొనియాడారు. స్మార్ట్‌సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ నగరాలకు రూ 1,116కోట్ల నిధులు విడుదల చేశామని అన్నారు.మిగతా నగరాలకు భిన్నంగా కరీంనగర్ కార్పొరేషన్ ఆచరణలో చూపించిందని అన్నారు. స్మార్ట్‌సిటీ కింద కరీంనగర్‌కు రూ. 826కోట్లు వచ్చాయన్నారు. ఇందులో కేంద్రం నుంచి రూ.428 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.398 కోట్లు విడుదలయ్యాయన్నారు. మిగతా పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఫ మంత్రి సంజయ్ గళమెత్తడంతోనే నిధులు విడుదల
స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లిస్తే గళమెత్తిన నాయకుడు మంత్రి మీ బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఈ అంశంపై నిలదీశారన్నారు. దారి మళ్లించిన నిధులను వడ్డీతోసహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేయించేలా చేసిన ఘనత సంజయ్ దే అన్నారు. ఈరోజు కరీంనగర్ లో కేంద్రం విడుదల చేసిన నిధులన్నీ ఖర్చవుతున్నాయంటే ఆ క్రెడిట్ బండి సంజయ్‌కే దక్కుతుందని అభినందించారు. ప్రతిరోజు తాగునీటిని అందిస్తున్న నగరంగా కరీంనగర్‌కు కీర్తిని తీసుకువచ్చారని ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. విలీన గ్రామాలకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలని కేంద్రమంత్రి ఖట్టర్ ఆకాంక్షించారు. కరీంనగర్ ఎంపీ సొంతూరైన కార్పొరేషన్ మిగతా పట్టణాలకు పోటీగా అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలని... తన వంతు సహకారం ఎల్లపుడూ బండి సంజయ్‌కు, కరీంనగర్ ఉంటుందని కేంద్రమంతి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్‌లో కరీంనగర్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా నాలుగు కోట్ల నగదు బహమతి అందుకోవడం అభినందనీయమని అన్నారు. పారిశుద్యం విషయంలో ఇక్కడి అధికారులు సిబ్బంది బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.