జల్సారాయుళ్లు
ABN , Publish Date - Feb 07 , 2025 | 02:26 AM
కరీంనగర్ నుంచి ప్రతినెలా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వియత్నాం, బిస్కేక్, సిక్కిం, శ్రీలంక, గోవా పట్టణాలకు వెళ్తున్నారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కరీంనగర్ నుంచి ప్రతినెలా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వియత్నాం, బిస్కేక్, సిక్కిం, శ్రీలంక, గోవా పట్టణాలకు వెళ్తున్నారు. వీరంతా టూరిజం ప్యాకేజీల్లో విహారయాత్రలకు వెళ్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉండే క్యాసినోవాల్లో, క్లబ్బుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే శిబిరాల్లో జూదం ఆడడానికి వెళ్తున్నారు. నెలనెలా జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లు ఐదు కోట్లకు తగ్గకుండా తమ జల్సాలపై వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులపై నిషేధం అమలు చేస్తుండడంతో రహస్యంగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని రిసార్టుల్లో, హోటల్స్‌లో సరదా తీర్చుకునేవారు.
పేకాట.. మందు.. విందు
ప్రభుత్వం వీటిపై కూడా నిఘా పెట్టడంతో పేకాట రాయుళ్ల కేరాఫ్ అడ్రస్ గోవాకు, శ్రీలంకకు మారింది. గోవా, శ్రీలంక బోర్ కొట్టాయో ఏమో కానీ గత కొద్ది నెలలుగా వారంతా వియత్నాం, బిష్కెక్, సిక్కిం లాంటి ప్రాంతాలకు విమానాల్లో వెళ్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే పేకాట రాయుళ్లతోపాటు కరీంనగర్ పేకాటరాయుళ్ల అడ్రస్‌లు సంపాదించి నెలనెలా నాలుగైదు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. వియత్నాం వెళ్లినా, బిష్కెక్, సిక్కిం, శ్రీలంక వెళ్లినా, గోవాలో సేద తీరినా విమాన ఖర్చులు, ఆయా పట్టణాల్లో హోటల్ బస, భోజన ఏర్పాట్లు, మందు, విందుల ఖర్చులన్నీ నిర్వహకులే భరిస్తారు.
రూ. లక్షల్లో డిపాజిట్లు
వియత్నాం, బిష్కెక్ వెళ్లాలంటే అప్పటి డిమాండ్‌ను బట్టి 2 లక్షల నుంచి 4 లక్షలు, సిక్కిం, శ్రీలంక వెళ్ళాలంటే 1.5 లక్షల నుంచి 2.50 లక్షలు, గోవా వెళ్లాలంటే లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. వీసా లేనివారికి నిర్వహకులే నెలరోజుల గడువుతో వీసా ఇప్పించే ఏర్పాటు చేస్తారు. డబ్బులు డిపాజిట్ చేస్తే చాలు.. అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. అక్కడ 20వేల టేబుల్ నుంచి లక్ష రూపాయల టేబుల్ వరకు పేకాట జరుగుతుంది. ఒక్కో టేబుల్‌కు తొమ్మిది మంది చొప్పున ఆడుతారు. అందులో ఒక హ్యాండ్ అమౌంట్‌ను నిర్వహకులు ఖర్చుకింద తీస్తారు. మూడు, నాలుగు రోజులపాటు ఆయా ప్రాంతాల్లో గడిపిన పేకాటరాయుళ్లు తాము డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తం కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒకరో.. ఇద్దరో వెళ్ళిన మొదటిరోజో, రెండోరోజో డబ్బు వస్తే అక్కడితో సరిపెట్టుకుని ఇంటికి వస్తారు. లేకుంటే వచ్చింది తెచ్చుకున్నది పోగొట్టుకుంటున్నారు. చాలా మంది నాలుగైదు రోజులు పేకాట సరదా తీర్చుకున్నాం... డిపాజిట్‌చేసిన సొమ్ము ప్రయాణ ఖర్చుల కింద తిన్నది, తిరిగినదానికింద పోయిందనుకొని సంతృప్తి చెంది ఇంటికి వస్తారు.
ఒక్కో ఈవెంట్‌కు 1,500 మంది వరకు..
కరీంనగర్ నుంచే ప్రతి నెలా 1,500 మంది పేకాటకు విదేశాలకు వెళ్తున్నారని సమాచారం. ఈవెంట్‌కు వెళ్లే వారి డిపాజిట్లు రాగానే నిర్వాహకులు తేదీలు ఖరారు చేసి ఫ్లయిట్ టికెట్లు పంపిస్తారు. ఈవెంట్‌కు ఒక్కొక్కరు లక్ష రూపాయలు డిపాజిట్ చేసినా 15 కోట్లు వసూలవుతాయి. ఇందులో కనీసం సగం డబ్బును పేకాటరాయుళ్లు ఆటలో పోగొట్టుకుంటారు. నిర్వహకులు విమానం, వసతి, భోజనం, మందు, విందు ఏర్పాటు చేసినందుకుగాను ఇందులో సగం డబ్బు పోతుంది. ఒక్కో ఈవెంట్‌కు మూడు కోట్ల రూపాయల వరకు నిర్వాహకులకు మిగులుతుంది. పేకాటరాయుళ్లను సమీకరించేందుకు ఏజెంట్లు ఉంటారు. వీరికి ఒక్కోమనిషిని సమకూర్చినందుకు ఆ ట్రిప్పులో సంపాదించిన డబ్బులో 10 శాతం మేరకు చెల్లిస్తారు. పేకాట పేరిట కరీంనగర్ జిల్లా నుంచే నెలనెలా ఐదు కోట్ల రూపాయల మేరకు ఇతర దేశాలకు వెళ్తున్నదని సమాచారం.