‘ప్రత్యేక’ పాలనలో పడకేసిన పల్లెలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:07 AM
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. యేడాది క్రితం పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలతో పాటు ప్రతీ గ్రామ

(ఆంధ్రజ్యోతి, జగిత్యాల/నెట్‌వర్క్)
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. యేడాది క్రితం పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలతో పాటు ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా ఏ గ్రామంలో చూసినా పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోడ్లపైనే మురుగు, చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి. పచ్చదనం, స్వచ్చదనం తూతూమంత్రంగా తయారైంది. కనీస సౌకర్యాలు లేక ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చి ఏడాది దాటినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ఫఅస్తవ్యస్తంగా మురుగు కాలువలు
గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, వీధుల్లో నీటి నిల్వలు ఉండడంతో దోమలు ప్రబలి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. వీధుల్లో చిన్న గుంత ఏర్పడినా పూడ్చే వారే కరువయ్యారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. ఆయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు ఎప్పుడో ఒక్కసారి వచ్చి వెళ్తుంటే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక అధికారులు కేవలం సంతకాలకే పరిమితమైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి సరియైున విధంగా నిధులు మంజూరు కాకపోవడంతో కార్యదర్శులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫజీపీలకు నిధుల కొరత
గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. దీంతో పంచాయతీలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. యేడాది కాలంలో పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండడంతో పాలన స్తంభించిపోయింది. మల్టీపర్పస్ కార్మికులకు మాత్రం వేతనాలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత యేడాది ఇంటి పన్ను వసూళ్లతో కార్మికుల వేతనాలు చెల్లించారు. వీధిలైట్లు, తాగునీటి క్లోరినేషన్, ఇతరత్రా నిర్వహణ అంతా పన్నుల రూపేణా వచ్చిన నిధులతో చేపడుతుండగా, మరికొన్ని చోట్ల కార్యదర్శులు సొంత డబ్బులతో నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయింది.
ఫ నర్సరీల్లో ఎండుతున్న మొక్కలు
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణకు, తాగునీటి సరఫరాకు, మొక్కల పెంపకానికి ట్యాంకర్లను గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం మెజార్టీ గ్రామాల్లో సంబంధిత ట్రాక్టర్లు మూలనపడ్డాయి. మరికొన్ని గ్రామాల్లో నామమాత్రంగా వినియోగిస్తున్నారు. మరమ్మతుల పేరిట ట్రాక్టర్లను పక్కనపెట్టడంతో చెత్త సేకరించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా మురికి కాల్వల నుంచి తీసిన చెత్త 20 రోజులకు పైగా రోడ్లపైనే ఉంటోంది. ఇంటింటికీ చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు వెళ్లకపోవడంతో గ్రామాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ట్రాక్టర్ల మరమ్మతుతో తాగునీటి ట్యాంకర్లు సైతం నిరుపయోగంగా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం, నర్సరీల్లో మొక్కలు ఎండిపోతున్నాయి.
ఫపని ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు
గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్యదర్శులపై పని భారం పెరిగింది. పంచాయతీలకు నిధుల సమస్య ఉండడంతో తమకు ప్రభుత్వం నుంచి వచ్చే వేతనాలను గ్రామ పంచాయతీ అవసరాలకు వ్యయం చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. జిల్లాలోని మెజార్టీ గ్రామాల్లో ఇదే తీరు కనిపిస్తోంది. ప్రత్యేకాధికారులు కేవలం సభలు, సమావేశాలకు మాత్రమే వస్తుండడంతో అధిక భారం తమపైనే పడుతోందని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.