Share News

అప్రమత్తతే శ్రీరామరక్ష

ABN , Publish Date - Feb 21 , 2025 | 02:49 AM

జిల్లాలో ముప్పై ఏళ్లు దాటిన వారిలో పలువురు రక్తపోటు (బీపీ), మధుమేహంతో బాధపడుతున్నారు.

అప్రమత్తతే శ్రీరామరక్ష

జగిత్యాల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముప్పై ఏళ్లు దాటిన వారిలో పలువురు రక్తపోటు (బీపీ), మధుమేహంతో బాధపడుతున్నారు. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీస్‌ (ఎన్‌సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం కింద జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారి జనాభా 5,83,389 ఉండగా వారికిమూడు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. వారిలో 15.24 శాతం మంది బీపీ, 6.94 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. జిల్లాలో ఎన్‌సీడీ కార్యక్రమం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఎన్‌సీడీ కార్నర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్టాఫ్‌ నర్స్‌లను కేటాయించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రిల్లో ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు వచ్చే బీపీ, షుగర్‌ బాధితులకు నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇస్తున్నారు. ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ కార్డు జారీ చేసి ప్రతి నెలా మందులు జారీ, వాడకం వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో బీపీ, షుగర్‌ బాధితులకు సేవలు అందుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

నియంత్రణే మార్గం

బీపీ, షుగర్‌ ఒక్కసారి సోకితే నియంత్రణ తప్ప నివారణకు అవకాశం ఉండదని వైద్యులు అంటున్నారు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీస్‌ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించింది. 30 సంవత్సరాల వయసులో బీపీ, షుగర్‌ గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్య సేవలు అందించడం తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్‌ బాధితులను గుర్తించగా సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. అయితే మరోమారు స్ర్కీనింగ్‌ నిర్వహిస్తే జిల్లాలో బీపీ, షుగర్‌ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

మరో దఫా పరీక్షలకు సన్నద్ధం

ఇప్పటికే 30 ఏళ్లు దాటిన వారిలో బీపీ, మధుమేహ బాధితులను గుర్తించేలా మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే బీపీ, షుగర్‌తో పాటు మూడు రకాల వ్యాధులను గుర్తింపునకు ఇంకో విడత సర్వే చేపట్టాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ నిర్ణయించింది. ఈ సర్వే సాధ్యమైనంత తొందరలో మొదలు కానుంది. మార్చి నెలాఖరు వరకు పరీక్షలు పూర్తి చేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. చాలా మంది బీపీ, షుగర్‌ బాధితులు తాము వాటి బారిన పడిన సంగతే గుర్తించడం లేదు. నిర్లక్ష్య ధోరణి కారణంగా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయమం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - Feb 21 , 2025 | 02:49 AM