వాహన తనిఖీలు ముమ్మరం
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:53 PM
కరీంనగర్ పట్టణంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొందరు ద్విచక్రవాహనాలు, కార్లకు ఎలాంటి నెంబర్‌ప్లేట్ లేకుండా లేదా ఇతర వాహనాల నెంబరు ప్లేట్‌లను తగిలించుకుని తిరుగుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ కేసులు, జరిమానాల నుంచి తప్పించుకుంటున్న ఘటనలు పెరిగిపోవడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పట్టణంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొందరు ద్విచక్రవాహనాలు, కార్లకు ఎలాంటి నెంబర్‌ప్లేట్ లేకుండా లేదా ఇతర వాహనాల నెంబరు ప్లేట్‌లను తగిలించుకుని తిరుగుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ కేసులు, జరిమానాల నుంచి తప్పించుకుంటున్న ఘటనలు పెరిగిపోవడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కొందరు మైనర్‌లు, యువకులు నెంబరు ప్లేట్‌లు లేకుండా ద్విచక్రవాహనాలతో తిరుగుతూ త్రిబుల్ రైడింగ్, సెల్‌ఫోన్ రైడింగ్, ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మరో వైపు చెయిన్ స్నాచింగ్, తాళంవేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్సపడటం, మద్యం సేవించి, అతివేగంతో రోడ్డు ప్రమాదాలు చేయటం వంటి తీవ్రమైన సంఘటనల్లో నిందితులు నెంబర్‌ప్లేట్‌లు లేకుండా వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఆయా కేసుల్లో నేరస్థులను పట్టుకోవటం పోలీసులకు కష్టంగా మారింది. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న నిందితులకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు కరీంనగర్‌లో ఇక నుంచి రోజూ ట్రాఫిక్ పోలీసులతోపాటు ఎక్కడికక్కడ సివిల్ పోలీసులు వాహనాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ పట్టణంలో నిత్యం ఎక్కడో ఒక చోట క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేయటం ప్రారంభించారు. రెండు నెలల్లో కరీంనగర్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిచిన తనిఖీల్లో 200కుపైగా వాహనాలు పట్టుబడ్డాయి. ఈ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు వాహన యజమానులకు జరిమానా విధించారు. అనంతరం అక్కడికక్కడే వారి వాహనాలకు నెంబర్‌ప్లేట్‌లు బిగింపజేసి, ట్రాఫిక్ పోలీసు ఠాణాలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరోసారి ఇటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనటకు పాల్పడితే భారీ జరిమానా విధించటంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని, కోర్టుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్, తెలంగాణ చౌక్, కోర్టు చౌరస్తా ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా నెంబర్‌ప్లేట్‌లు లేని 70 వాహనాలు పట్టుబడ్డాయి.
ఫ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
- కరీం ల్లా ఖాన్, కరీంనగర్ ట్రాఫిక్ సీఐ
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రయాణం క్షేమంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇక నుంచి నిత్యం వాహనాల తనిఖీలుంటాయి. ప్రమాదాల నివారణకే ఈ చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు సహకరించాలి.