ఈపాస్ మిషన్ల ద్వారానే యూరియా విక్రయించాలి
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:21 AM
ఈ పాస్ మిషన్ల ద్వారా మాత్రమే యూరియాను రైతులకు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి డీలర్లను ఆదేశించారు.
జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి
కరీంనగర్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ పాస్ మిషన్ల ద్వారా మాత్రమే యూరియాను రైతులకు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి డీలర్లను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో డీసీఎంఎస్, ఆగ్రోస్, పీఏసీఎస్ సెంటర్ల డీలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డీఏవో మాట్లాడుతూ జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. ప్రతి సెంటర్‌లో యూరియా నిల్వలను ముందస్తుగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా రైతులకు ఇబ్బంది కలుగకుండా యూరియాను ఇవ్వాలని, యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ అవసరం మేరకు మార్క్‌ఫెడ్‌కు డబ్బులు చెల్లించి ఇండెంట్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో కరీంనగర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకుడు రణధీర్‌కుమార్, వ్యవసాయాధికారులు ఎం కృష్ణ, బి సత్యం, ఎం హరిత తదితరులు పాల్గొన్నారు.