Share News

నేడు కేంద్ర బడ్జెట్‌

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:41 AM

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశలు పెంచుకున్నారు. ఎన్నోఏళ్లుగా పెండింగులో ఉన్న రాఘవాపూర్‌-మణుగూర్‌ రైల్వే లైన్‌కు ఏ మేరకు నిధుల కేటాయింపు ఉంటుంది,

 నేడు కేంద్ర బడ్జెట్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశలు పెంచుకున్నారు. ఎన్నోఏళ్లుగా పెండింగులో ఉన్న రాఘవాపూర్‌-మణుగూర్‌ రైల్వే లైన్‌కు ఏ మేరకు నిధుల కేటాయింపు ఉంటుంది, పెద్దపల్లి నుంచి నిజామాబాదు మార్గాన్ని డబుల్‌ మార్గంగా విస్తరణకు అడుగులు పడతాయా, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖాజీపేట మార్గాల్లో కొత్తరైళ్లు నడవనున్నాయా, బసంత్‌నగర్‌ మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందా, లేదా అనే చర్చ జరుగుతున్నది. శనివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

ఫ భూసేకరణతో ఆశలు..

కోల్‌ కారిడార్‌ను కలిపేందుకు 20 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన రాఘవాపూర్‌ (పెద్దపల్లి)-మణుగూర్‌ 206 కిలోమీటర్ల సింగిల్‌ విద్యుత్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి రెండు దశాబ్దాల తర్వాత గత ఏడాది కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు గెజిట్‌ జారీ చేసింది. దీంతో పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈమార్గానికి ఈ బడ్జెట్‌లో నిధులు అధికంగా కేటాయిస్తే పనులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఈ మార్గం పూర్తయితే పర్యాటకంగా, సరకు రవాణా పరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఈ మార్గానికి ఇప్పటికే పర్యావరణ శాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయి.

ఫ పెద్దపల్లి- ఇందూర్‌ మార్గం..

పెద్దపల్లి నుంచి ఇందూర్‌ (నిజామాబాదు) మార్గాన్ని డబుల్‌ మార్గంగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మార్గం గుండా కరీంనగర్‌-తిరుపతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, నిజామాబాద్‌-కాగజ్‌నగర్‌ వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అత్యంత లాభాలు తెచ్చే మార్గాల్లో ఈ మార్గం ఒకటి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమలు విస్తరించడంతో గ్రానైట్‌తో పాటు మార్బుల్స్‌, ఇతరత్రా సరుకుల రవాణా అత్యధికంగా అవుతున్నాయి. ఈ మార్గంలో సరకు రవాణా రైళ్లు అధికంగా నడుస్తున్నాయి. ఈ లైన్‌ను డబుల్‌ లైన్‌గా విస్తరించడంతో పాటు ప్రయాణికుల రైళ్ల సంఖ్యకు అనుగుణంగా రైళ్లను పెంచాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.

ఫ మనోహరాబాద్‌- కొత్తపల్లి రైల్వే మార్గం..

హైదరాబాదు నుంచిఢిల్లీకి ప్రత్యామ్నాయ మార్గమైన మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి (కరీంనగర్‌) రైల్వే మార్గానికి ఈ బడ్జెట్‌లో అధిక నిధులు వెచ్చిస్తే వచ్చే మూడేళ్లలో ఈ మార్గం పూర్తయి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈమార్గం పనులు సిరిసిల్లలో ప్రారంభం అయ్యాయి. సికింద్రాబాద్‌-కాజీపేట-పెద్దపల్లి మార్గం రద్దీగా మారింది. దీనిని అధిగమించాలంటే ఈ మార్గం త్వరగా అందుబాటులోకి రావాలి.

ఫ రైల్వే డ్రైపోర్టుకు నిధులు కేటాయించాలి..

యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్‌ దగ్గర్లో వచ్చిన రైల్వే భూతల ఓడ రేవు (రైల్వే డ్రైపోర్టు)కి నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దపల్లి జంక్షన్‌కి దగ్గర్లో నిర్మాణమవుతున్న బైపాస్‌ రైల్వే మార్గాన్నీ త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి, ప్రస్తుతం ఇక్కడ కేవలం సింగిల్‌ రైల్వే బైపాస్‌ మార్గం నిర్మిస్తున్నారు. అలాగాకుండా రెండు లైన్‌ల బైపాస్‌తో పాటు రైల్వే స్టేషన్‌ నిర్మిస్తే ఇది పెద్దపల్లి జంక్షన్‌కి ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్‌గా మారి నిజామాబాదు నుంచి వరంగల్‌కి నేరుగా అనుసంధానం ఏర్పడి సమయం ఆదా అవుతుంది.

ఫ కొత్త రైళ్లను నడపాలి..

పెద్దపల్లి, కరీంనగర్‌ మార్గాల గుండా పలు కొత్త రైళ్లను నడిపిస్తే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కరీంనగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు వయా పెద్దపల్లి మీదుగా వందే మెట్రో (నమో భారత్‌ ర్యాపిడ్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించాలని, నిజామాబాదు నుంచి వరంగల్‌ వయా పెద్దపల్లి మీదుగా మెము ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలనే ప్రతిపాదన ఐదేళ్లుగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. హైదరాబాదు నుంచి వయా నిజామాబాదు, కరీంనగర్‌, పెద్దపల్లి, బల్లార్షా మార్గంలో ఢిల్లీకి తెలంగాణ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభించాలని, తిరుపతి నుంచి కరీంనగర్‌ బైవీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రతీరోజు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే ఈ రైలును నిజామాబాదు వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం కాజీపేట నుంచి దాదర్‌ ముంబయి 07195/96 వయా పెద్దపల్లి, నిజామాబాదు మార్గంలో నడుస్తున్న వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును రెగ్యులర్‌ రైలుగా మార్చి వారానికి కనీసం మూడు రోజులు నడపాలనే డిమాండ్‌ ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడల నుంచి ముంబయికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఏడాదిన్నర కాలంగా తరచూ రద్దవుతున్న 17035/36 బల్లార్షా-కాజీపేట, బల్లార్షా-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ రైలును పునఃప్రారంభించి నూతన చర్లపల్లి టెర్మినల్‌ వరకు పొడిగిస్తే హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ రైలు కరోనాకి పూర్వం 57135/36 కాజీపేట-అజినీ (నాగపూర్‌) వరకు నడిచేది. మధ్యాహ్నం 1:30 గంటల తరువాత సాయంత్రం 5 గంటలకు ముందు కాజీపేట నుంచి బెల్లంపల్లి మార్గంలో ఒక పుష్‌ఫుల్‌ రైలు ప్రవేశపెట్టాలని దశాబ్ద కాలంగా ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలి..

జాతీయ రహదారులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న 33 జిల్లా కేంద్రాల్లో కేవలం జాతీయ రహదారి లేని జిల్లా పెద్దపల్లి కావడం గమనార్హం. ప్రతిపాదిత జగిత్యాల, ధర్మారం, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, కిష్టంపేట, టేకుమట్ల, రామప్ప ఆలయం వరకు ఉన్న మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో జరుగుతున్న నాగపూర్‌ నుంచి విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలి. అలాగే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మీదుగా వెళ్లే రాయపూర్‌ నుంచి హైదరాబాదు గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, దీనివల్ల ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనుసంధానం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రామగిరి ఖిల్లా, మొలంగూరు ఖిల్లా, ఎలగందుల ఖిల్లాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు వేములవాడ, కొండగట్టు, ఓదెల, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను ప్రసాద్‌ పథకంలో చేర్చాలని, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, కాళేశ్వరం ఆలయాలను టూరిస్టు సర్క్యూట్‌లో చేర్చి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. బసంత్‌నగర్‌లో గల మినీ ఎయిర్‌పోర్టును విస్తరించే ప్రతిపాదనల్లో భాగంగా ఈబడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తే చుట్టు పక్కల జిల్లాల ప్రజలకు విమానయానం చేసే అదృష్టం వరించనుంది.

Updated Date - Feb 01 , 2025 | 01:41 AM