Share News

ధరణిలో సాంకేతిక సమస్యలతో ఇక్కట్లు

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:14 AM

ధరణి పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర లావాదేవీలు ఆలస్యం అవుతున్నాయి.

ధరణిలో సాంకేతిక సమస్యలతో ఇక్కట్లు

జగిత్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర లావాదేవీలు ఆలస్యం అవుతున్నాయి. స్లాట్‌ బుక్‌ కావడంలో సైతం జాప్యం ఏర్పడుతోంది. డిజిటల్లీ నాట్‌ సైన్డ్‌, సర్వే నంబరు సరిగా లేదని అంటూ వివిధ కారణాలు చూపుతూ సర్వర్‌ మొరాయిస్తోంది. ధరణి పోర్టల్‌ టెర్రాసిస్‌ నుంచి నేషనల్‌ ఇన్ఫర్మెటిక్స్‌ సెంటర్‌ చేతుల్లోకి వెళ్లినా తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో మ్యుటేషన్‌, నాలా, జీపీఏ, పీవోబీ, కోర్టు కేసులు, పాస్‌ బుక్‌ డేటా కరెక్షన్‌ తదితర దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ధరణి పోర్టల్‌ మాడ్యూల్స్‌లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పరిష్కారం కావడం లేదు. దీంతో బాధితులు తహసీల్దార్‌, ఆర్‌డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతా, సర్వే నంబర్లు మిస్సింగ్‌, తప్పులు, పట్టాదారు పేర్లు, ఫొటోల్లో తప్పులు, విస్తీర్ణంలో హెచ్చ తగ్గులు, పట్టా, అసైన్డ్‌ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు వంటి తప్పులు పరిష్కారం కావడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ భూములకు డిమాండ్‌ వచ్చింది. ఈ క్రమంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ భూ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మీ సేవలో ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ అధికారులు సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివి రిజెక్ట్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారుల నుంచి సరైన సమాధానమే ఉండడం లేదని రైతులు వాపోతున్నారు.

నెలల తరబడి కార్యాలయాల్లోనే..

ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం 2020 అక్టోబర్‌ 2న అమల్లోకి వచ్చింది. భూ సమస్యలు పారదర్శకంగా పరిష్కరించేందుకు జీఎల్‌ఎం పేరిట వెసులుబాటు కల్పించింది. రైతులు మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్‌ లాగిన్‌కు వెళ్తుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా తహసీల్దార్లకు కలెక్టర్‌ చేరవేస్తారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులు వచ్చిన నాలుగు రోజుల్లోనే పరిష్కరించాలి. అభ్యంతరాలు ఉంటే వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఏ దశలో ఉందనే విషయాన్ని సంబంధిత దరఖాస్తుదారుడికి తెలపాల్సి ఉంటుంది. కానీ ఈ నెల 25వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 1,125 ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు తమ భూ సమస్యలను ధరణి వెబ్‌సైట్‌ ద్వారా కలెక్టర్లకు విన్నవించేందుకు వెబ్‌సైట్‌ జీఎల్‌ఎం, టీం-33 మాడ్యుల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆప్షన్ల ద్వారా వేల మంది రైతులు తమ భూ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. దరఖాస్తులను తహసీల్దార్‌ కార్యాలయంలో పరిశీలించి సర్వే నంబర్‌పై మోఖా పంచనామా నిర్వహించి తుది నివేదికను కలెక్టర్‌ కార్యాలయానికి పంపుతున్నారు. అక్కడకు చేరిన నివేదికలను వేగంగా పరిశీలించి డిజిటల్‌ సంతకాలు చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా రైతుల దరఖాస్తులు నెలల తరబడి కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి.

భూమాతపై ఆశలు

ధరణి పోర్టల్‌లోని నిబంధనలతో రైతులు సమస్యల పరిష్కారానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ భూమాత పోర్టల్‌ తేవాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలు ఇంకా ఖరారు కానప్పటికీ ఆయా మండలాల్లోని తహసీల్దార్లు మాత్రం త్వరలో భూమాత వస్తుందని, మీ సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెబుతూ కార్యాలయాలకు వచ్చే రైతులను తిరిగి పంపిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కారం కాక, పట్టదారు, పాసుపుస్తకాలు రాక రైతులు బ్యాంకు రుణాలు, రైతు బంధు, ఇతర ప్రయోజనాలు పొందక తీవ్రంగా నష్టపోయారు. దీంతో కాంగ్రెస్‌ సర్కార్‌ తీసుకొచ్చే భూ మాత కోసం రైతులు నిరీక్షిస్తున్నారు.

మొత్తం పెండింగ్‌ దరఖాస్తులు...1,125

తహసీల్దార్‌ లాగిన్‌లో...505

ఆర్డీవో లాగిన్‌లో...307

అదనపు కలెక్టర్‌ లాగిన్‌లో 119

కలెక్టర్‌ లాగిన్‌లో 194

Updated Date - Jan 31 , 2025 | 01:14 AM