ముగ్గురు ఎమ్మెల్సీలు జిల్లావారే...
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:44 AM
తెలంగాణ శాసనమండలిలో జిల్లాకు చెందిన మరొకరికి ప్రాతినిధ్యం లభించింది. ఈనెల 27వ తేదీన జరిగిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు.

( ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
తెలంగాణ శాసనమండలిలో జిల్లాకు చెందిన మరొకరికి ప్రాతినిధ్యం లభించింది. ఈనెల 27వ తేదీన జరిగిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. సోమవారం కరీంనగర్‌లో జరిగిన ఓట్ల లెక్కింపులో కొమురయ్య సమీప అభ్యర్థి పీఆర్టీయూకు చెందిన వంగల మహేందర్ రెడ్డి పై 5,777 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు హక్కు కల్పించారు. దీంతో మల్క కొమురయ్య కూడా ఓటు హక్కు పొందారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధం పల్లికి చెందిన మల్క కొమురయ్య హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆయన పల్లవి విద్యాసంస్థలను నడిపిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అయిన ఆయన బీజేపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ప్రయివేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకుల మద్దతును కూడగట్టుకున్న ఆయన తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయ సాధించడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపొందడంతో ఉమ్మడి జిల్లా నుంచి చట్టసభల్లో రెండో వ్యక్తిగా ప్రాతినిధ్యం పొందారు. మల్క కొమురయ్య గెలుపుతో పెద్దపల్లి జిల్లాలో బీజేపీకి మరింత బలం చేకూరనున్నది.
ఇదే జిల్లాలోని ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన తానిపర్తి భాను ప్రసాదరావు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన మూడోసారి వరుసగా గెలుపొందడం గమనార్హం. 2021 డిసెంబర్ పదో తేదీన జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన 2022 ఫిబ్రవరి 21వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీకాలం 2028 ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఉంది. గత ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ, ఆ తర్వాత బీఆర్‌ఎస్ లో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో కి వచ్చారు.
అలాగే జిల్లాలోని ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి పరిపాటి వెంకట్రాంరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా కొనసాగారు. పదవీకాలం పూర్త్తికాకముందే కలెక్టర్ పదవికి రాజీనామా చేసే 2021లో కేసీఆర్ పిలుపుమేరకు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెంకట్రాంరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన డిసెంబర్ ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వెంకట్రాంరెడ్డి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా అడుగు పెట్టిన జిల్లాకు చెందిన ముగ్గురిలో ఒకరు కాంగ్రెస్, ఒకరు బీఆర్‌ఎస్, తాజాగా గెలిచిన మల్క కొమురయ్య బీజేపీ కి చెందిన వారు కావడం గమనార్హం. సదరు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం జిల్లాకు కేటాయించినట్లయితే జిల్లా మరింత అభివృద్ధి చెందనున్నది.