Share News

‘ఉపాధి’ ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:15 AM

గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నియంత్రించి కూలీలకు వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాలో చేపట్టాల్సిన పనుల కార్యాచరణ ప్రణాళికను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సిద్దం చేసింది.

‘ఉపాధి’ ప్రణాళిక ఖరారు

- 37.85 లక్షల పనిదినాలు

- రూ. 82.03 కోట్ల నిధులు

- 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ కార్యాచరణ

- ‘ఆత్మీయ భరోసా’తో ఉపాధి హామీ పనులకు పెరుగుతున్న డిమాండ్‌

జగిత్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నియంత్రించి కూలీలకు వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాలో చేపట్టాల్సిన పనుల కార్యాచరణ ప్రణాళికను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సిద్దం చేసింది. జిల్లాలో 20 మండలాల పరిధిలో రూ. 82.03 కోట్ల వ్యయంతో కూడిన 37.85 లక్షల పనిదినాలను కల్పించేలా ప్రణాళిక తయారు చేశారు.

ఫ కూలి గిట్టుబాటయ్యేలా పనులు..

జిల్లాలో 2025-26 సంవత్సరానికి గానూ ఉపాధి హామీ పథకం కింద 37.85 లక్షల పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. కూలీలు చేసిన ఉపాధి పనులతో పాటు మెటిరియల్‌ కాంపోనెంట్‌ కింద చెల్లించేందుకు గానూ మొత్తం నిధులు వ్యయం కానున్నట్లుగా ప్రతిపాదించారు. కూలీలకు రోజుకు రూ. 300 కూలి గిట్టుబాటయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదించిన నిధుల్లో కూలీలు చేసిన పనులకు గానూ అధిక వ్యయం అవసరం కాగా, మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద స్వల్ప నిధులు వ్యయం అయ్యే అవకాశం ఉండేలా కార్యాచరణ ఖరారు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని గత యేడాది అక్టోబరు 2వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించి చేపట్టాల్సిన పనులను ఎంపిక చేశారు.

- జల సంరక్షణకు ప్రాధాన్యం..

ఉపాధిహామీ ద్వారా చేపట్టాల్సిన పనుల్లో జల సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించేలా ఇంకుడు గుంతలు, వాటర్‌ షెడ్లు, చెక్‌ డ్యామ్‌లు, చెరువుల్లో పూడిక తీత, పంట కాలువలు, నీటి కుంటల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. లబ్ధి చేకూర్చేలా ఉపాధి హామీ నిధులతో పశువుల షెడ్లు, నీటి తొట్టీలను నిర్మించుకునే అవకాశం కల్పించారు. నర్సరీల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నీటి పారుదలకు సంబంధించి కాలువల పూడికతీత, పంట పొలాలకు అనుసంధాన రోడ్లు, హరితహారం కింద మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తీయడం, మొక్కల సంరక్షణకు నీటిని సరఫరా చేయడం వంటి పనులతో పాటు ఆయా గ్రామాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఇతరత్రా ఉపాధి పనులు చేపట్టనున్నారు.

- భారీగా డిమాండ్‌...

జిల్లాలో ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 39.99 లక్షల మొత్తం పనిదినాల లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 35.91 లక్షల పనిదినాలు కల్పించారు. ఇంకా సుమారు 45 రోజుల గడువు ఉన్నందున ఆలోపు లక్ష్యం పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యంలో 89.81 శాతం పనులు పూర్తి చేశారు. కాగా రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే ఉపాధి పనులకు ఈ సారి భారీగా డిమాండ్‌ ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే భూమిలేని కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరసా కింద యేడాది రూ. 12 వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనికి ప్రాతిపదికన కనీసం 20 రోజులు ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలను అర్హులుగా గుర్తిస్తోంది. దీంతో జాబ్‌ కార్డు కలిగి ఉండి ఇప్పటివరకు పనులకు వెళ్లని వారు, జాబ్‌ కార్డు తీసుకోకుండా ఉన్న నిరుపేదలంతా ఉపాధి హామీ పనులకు హాజరయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా పనులు కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో మండలాలు- 20

గ్రామ పంచాయతీలు- 380

జాబ్‌ కార్డులు - 1.67 లక్షలు

మొత్తం కూలీల సంఖ్య- 2.73 లక్షలు

శ్రమ శక్తి సంఘాల్లో ఉన్న కుటుంబాల సంఖ్య - 1.05 లక్షలు

శ్రమశక్తి సంఘాల్లో ఉన్న కూలీల సంఖ్య- 1.46 లక్షలు

లక్ష్యం మేరకు పనిదినాలు పూర్తి చేస్తాము

- రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, జగిత్యాల

జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనికల్పించే దినాలను పూర్తి చేస్తాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు లక్ష్యం పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా రానున్న నూతన ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, పనిదినాలు తదితర కార్యాచరణను సిద్ధం చేశాము.

Updated Date - Feb 15 , 2025 | 01:15 AM