Share News

మార్చి నెలాఖరులోగా ‘స్మార్ట్‌’ పనులు పూర్తికావాలి

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:10 AM

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, పీఎంసీ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

మార్చి నెలాఖరులోగా ‘స్మార్ట్‌’ పనులు పూర్తికావాలి

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, పీఎంసీ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు స్మార్ట్‌సిటీ గడువు పొడగించినందున ఆలోగా నగరంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిధులు వెనక్కి వెళ్లకుండా చూడాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించి, గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించిన వర్క్‌ స్లిప్‌ ఆర్డర్‌ పెట్టి బిల్లులు చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్‌సిటి ప్రారంభం నుంచి మార్చి 31 వరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డిటేల్డ్‌ రిపోర్టు అందించాలన్నారు. వచ్చే బోర్డు మీటింగ్‌ వరకు ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌కు సంబంధించిన పనులను ప్రజారోగ్యశాఖ సమన్వయంతో ప్రారంభించి, ఇంటింటికి కనెక్షన్లు ఇచ్చి ఎస్టీపీకి అనుసంధానం చేయాలని సూచించారు. పద్మనగర్‌ జంక్షన్‌ సుందరీకరణ పనులను వెంటనే ప్రారంభించి, వేగంగా పూర్తయ్యేలా చూడాలని, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి సర్కిల్‌ను రూపొందించి జంక్షన్‌కు మార్కింగ్‌ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఈ క్లాస్‌ రూమ్స్‌, ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేసి బిల్‌ రికార్డు చేయాలని ఆదేశించారు. చివరి బోర్డు మీటింగ్‌ వరకు ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ రొడ్డ యాదగిరి, డీఈ ఓంప్రకాశ్‌, లచ్చిరెడ్డి, అయూబ్‌ఖాన్‌, వెంకటేశ్వర్లు, సతీష్‌, పీఎంసీ అధికారి సందీప్‌ పాల్గొన్నారు.

ఫ విలీన గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరచాలి

నగరపాలక సంస్థలో విలీనమైన చింతకుంటతోపాటు అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం చింతకుంట గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి పరిశుభ్రతను, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు పిన్‌ పాయింట్‌ పద్ధతిని అమలు చేసి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని, ప్రతి రోజూ ఉదయం కార్మికుల హాజరును బయోమెట్రిక్‌లో నమోదు చేయాలని సూచించారు. డ్రైనేజీల్లోని సిల్ట్‌ను, పిచ్చిమొక్కలను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ వేణుమాధవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:10 AM