కలిసొచ్చిన కాలం.. వరి సాగు వైపు మొగ్గు
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:08 AM
యాసంగి నాట్ల జోరు ముగిసింది. కూలీల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డా పొరుగు రాష్ట్రాల నుంచి వలసవచ్చిన కూలీలతో ఊరట లభించింది. మరోవైపు వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేసినా అల్పపీడన ప్రభావంతో కాలం కలిసొచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు, అనంతగిరి, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లలో సాగునీరు సమృద్ధిగా ఉండడంతో పాటు బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో మెట్ట ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సాగుకు ఢోకాలేదని భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
యాసంగి నాట్ల జోరు ముగిసింది. కూలీల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డా పొరుగు రాష్ట్రాల నుంచి వలసవచ్చిన కూలీలతో ఊరట లభించింది. మరోవైపు వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేసినా అల్పపీడన ప్రభావంతో కాలం కలిసొచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు, అనంతగిరి, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లలో సాగునీరు సమృద్ధిగా ఉండడంతో పాటు బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో మెట్ట ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సాగుకు ఢోకాలేదని భావిస్తున్నారు. జిల్లాలో యాసంగిలో 1.72 లక్షల్లో వివిధ పంటలు సాగు చేయగా, వరి 1.69 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 1491 ఎకరాలు, గోదుమ 50 ఎకరాలు, కందులు 180 ఎకరాలు, పల్లి 25 ఎకరాలు, నువ్వులు 134 ఎకరాలు, పొద్దు తిరుగుడు 1021 ఎకరాల్లో సాగు చేశారు. మరోవైపు సన్నరకాల సాగుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఉండడంతో రైతులు సన్నాలవైపు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు.
ఫ రైతులకు తప్పని భారం..
కూలీల కొరత, వ్యవసాయ ఇతర పనులకు సంబంధించి ట్రాక్టర్‌తో దున్నడం వంటి పనుల భారం కూడా యాసంగిలో రైతులపై ఎక్కువగానే పడింది. రైతులు నాట్లు వేయడానికి ఇబ్బందులు పడ్డ క్రమంలో బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూలీలు వలసవచ్చారు. ఎకరానికి రూ.5,500 నుంచి రూ.6,500 వరకు చెల్లించాల్సి వచ్చింది. స్థానికంగా కూడాగతంలో 300 నుంచి రూ.400 వరకు మహిళ కూలీలకు చెల్లించే కూలీ రూ.500 నుంచి రూ.600లకు పెరిగింది. మగ, కూలీలకు రూ.700 నుంచి రూ.800 వరకు చెల్లించారు. కూలీల కొరతనే కాకుండా ఈసారి రైతులకు ఎరువుల భారం కూడా పడింది. వరికి ఎక్కువగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. బస్తా కాంప్లెక్స్ ధరపై రూ.100 అదనపు భారం పడింది. జిల్లాలో యాసంగి సాగుకు యూరియా 21,811 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,359 మెట్రిక్ టన్నులు, ఎంపీకేఎస్ 11,516 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4,607 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,440 మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగిస్తున్నారు. ఎరువుల భారం కూడా రైతులపై పడింది.
ఫ ఆశాజనకంగా సాగునీరు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగికి సాగునీరు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్ట్, అన్నపూర్ణ ప్రాజెక్ట్, ఎగువ మానేరు, నిమ్మపల్లి ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు నీటి కళను సంతరించుకున్నాయి. వరికి, నీటి వసతి ప్రధానం కావడంతో చెరువులు, కుంటలతో పాటు బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 843.04 సాధారణ వర్షాపాతానికి 1009.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. రుద్రంగిలో 963.4 మిల్లీమీటర్లు, చందుర్తిలో 1279.4 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌లో 894.2 మిల్లీమీటర్లు, బోయినపల్లిలో 955.8 మిల్లీమీటర్లు, వేములవాడలో 1022.7 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 981.6 మిల్లీమీటర్లు, కోనరావుపేటలో 922.9 మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 1199.6 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 1017.7 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 872.8 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 1021.2 మిల్లీమీటర్లు తంగళ్లపల్లిలో 1024.2 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 967.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 22.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో యాసంగికి ఇబ్బంది ఉండదని రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో యాసంగి వరిసాగు(ఎకరాల్లో..)
మండలం సాగు మొత్తం వరి
గంభీరావుపేట 18000 18000
ఇల్లంతకుంట 26124 24000
ముస్తాబాద్ 20006 20000
సిరిసిల్ల 3803 3800
తంగళ్లపల్లి 18060 18000
వీర్నపల్లి 6520 6520
ఎల్లారెడ్డిపేట 16359 16355
బోయినపల్లి 12510 12200
చందుర్తి 16545 16500
కోనరావుపేట 17806 17800
రుద్రంగి 4850 4500
వేములవాడ 2500 2500
వేములవాడ రూరల్ 9500 9500
---------------------------------------------------------------------------------------------
మొత్తం 172583 169675
---------------------------------------------------------------------------------------------