Share News

అన్నదాతల నిరీక్షణ

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:16 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాలు గల రైతులకు మాత్రమే సాయం అందింది.

అన్నదాతల నిరీక్షణ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాలు గల రైతులకు మాత్రమే సాయం అందింది. మిగతా రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెలరోజులుగా ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా అని రైతులు నిరీక్షిస్తున్నారు. కాంరగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకాన్ని అమలు చేశారు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములుగా పట్టాలు కలిగిన రైతులందరికీ ప్రతి సీజన్‌లో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులతో పాటు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. రైతుకూలీలకు కూడా భరోసాను అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. గడిచిన వానాకాలం సీజన్‌ నుంచే రైతు భరోసా అమలు చేస్తుందని అంతా ఎదురుచూశారు. ఆ సీజన్‌లో రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ పథకాన్ని అమలు చేసింది. జిల్లాలో 450 కోట్ల రూపాయల వరకు సంబంధిత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. కానీ ఆ సీజన్‌లో రైతు భరోసా ప్రారంభించ లేదు. ఈ యాసంగి సీజన్‌ నుంచి సాగుకు యోగ్యమైన భూములు కలిగిన రైతులకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అది కూడా ఎకరానికి ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా 7,500 రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు సాగులో ఉన్న భూములను గుర్తించేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సర్వే చేశారు.

- సాగులో లేని భూములు 2655 ఎకరాలు..

జిల్లాలో ధరణి పోర్టల్‌ ప్రకారం పట్టా కలిగిన భూములు 2,78,555 ఎకరాల భూములు ఉండగా, ఇందులో పంటలు సాగు చేయని బంచరాయి భూములు, రియల్‌ ఎస్టేట్‌ భూములు, నాలా కన్వర్షన్‌ చేయకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న 2655.32 ఎకరాల భూములు సాగులో లేవని గుర్తించారు. 2,75,899 ఎకరాల భూములు సాగులో ఉన్నట్లు తేల్చారు. మొత్తం 1,61,032 మంది రైతులకు రైతు భరోసా కింద 165 కోట్ల 53 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. మొదట మండలానికి ఒక గ్రామంలో పూర్తి స్థాయిలో రైతులందరికీ రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఒక ఎకరం గల రైతులకు డబ్బులు జమ చేయడం ఆరంభించారు. ఇంతలో కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రైతు భరోసా డబ్బులు జమ అవుతాయో, కావోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల కమిషన్‌ రైతు భరోసా డబ్బులు జమ చేసే విషయమై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రభుత్వం ఆపథకాన్ని కొనసాగించింది.

- రూ. 82.57 కోట్లు జమ

ఇప్పటి వరకు మూడెకరాల వరకు గల 1,14,313 మంది రైతులకు 82 కోట్ల 57 లక్షల 68 వేల 13 రూపాయలు జమ చేసింది. మూడు ఎకరాలకు పైగా భూములు కలిగిన దాదాపు 45వేలకు పైగా రైతులకు 51 కోట్ల రూపాయల వరకు జమ చేయాల్సి ఉంది. ఎప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అని రైతులు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తున్నారు. డబ్బులు పడలేదనే సమాధానాలతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఈ డబ్బులు జమ కాక పోగా, ఇప్పటి వరకు గుర్తించిన సాగు భూముల్లో నాలా కన్వర్షన్‌ కాకుండా పంటలకు బదులు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇటుకబట్టీలు, ఇతర చిన్నచిన్న పరిశ్రమలను ఏమైనా ఉన్నాయా అని పరిశీలించాలని ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ శాఖలను ఆదేశించింది. నామమాత్రంగా సర్వేచేసిన సదరు అధికారులు జిల్లాలో సాగుచేయని భూములు లేవని రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఖాతాల్లో రైతు భరోసా కింద డబ్బులు జమ చేయాలని మూడెఎకరాలకు పైబడిన రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 01:16 AM