కులగణన సర్వేకు శాస్త్రీయత లేదు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:58 AM
రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిటీ, బీసీ కమిషన్ లేకుండా ప్లానింగ్ కమిటీ ద్వారా చేపట్టిన కులగణన సర్వేకు శాస్త్రీయత లేదు, ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే బీహార్ ప్రభుత్వం జీఏడీతో చేపట్టిన కులగణన అశాస్త్రీయమంటూ అక్కడి కోర్టు కొట్టేసినట్లు కుల గణను కొట్టి వేస్తుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు.

- కులాలవారీగా ముసాయిదాను బహిర్గతం చేయాలి
- బీసీలను తగ్గించి అవమాన పరిచారు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిటీ, బీసీ కమిషన్ లేకుండా ప్లానింగ్ కమిటీ ద్వారా చేపట్టిన కులగణన సర్వేకు శాస్త్రీయత లేదు, ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే బీహార్ ప్రభుత్వం జీఏడీతో చేపట్టిన కులగణన అశాస్త్రీయమంటూ అక్కడి కోర్టు కొట్టేసినట్లు కుల గణను కొట్టి వేస్తుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ కుల గణన రీ సర్వే చేపట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి కులాలవారీగా సమాచారం సేకరించి, ముసాయిదాను గ్రామసభల్లో పెట్టి ఆమోదించిన తర్వాత మంత్రివర్గం ఆమోదించి పార్లమెంట్‌కు పంపించి జనాభా దామాషా ప్రకారంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ కులగణన 2011 జనాభా ప్రకారంగా ఇంట్లో కూర్చొని అశాస్త్రీయంగా చేసి తెలంగాణ రాష్ట్ర జనాభాతో పాటు బీసీ జనాభాను తగ్గించి 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన మోసాన్ని మరోసారి చేసిందని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకసారి బీసీ నాయకుడు సీఎం అయ్యాడు కానీ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకానీ, తెలంగాణలో కానీ ఒక్కరు కూడా బీసీ కాలేదని ఇది బీసీలకు జరిగిన అన్యాయానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి సీఎం కేసీఆర్ రాజ్యాధికారం బీసీలకు అందించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రిగా తాను కొనసాగుతుండగా వకుళాభరణం కృష్ణమోహన్ చైర్మన్‌గా 2021 నవంబర్ 16న బీసీ కమిషన్ వేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో ఆమోదించి దాని ప్రకారంగా ఫలాలు అందిస్తామని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. జనవరి 29, 2024లో బీసీ కమిషన్ చైర్మన్ కమిషన్ నివేదికను ప్రస్తుత ప్రభుత్వానికి సమర్పించగా, కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదం తెలిపి అసెంబ్లీ ఏర్పాటు చేసి చట్టం చేస్తామని ప్రకటించిందని అన్నారు. బీహార్, కర్ణాటక ప్రభుత్వాలుశాస్త్రీయంగా కులగణన చేయకపోవడంతో కోర్టు కొట్టేసిందన్నారు. బీజీ కమిషన్ చైర్మన్‌గా నిరంజన్‌ను నియమించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ జీవో 26ను బొందపెట్టారన్నారు. ప్లానింగ్ కమిషన్ నుంచి జీవో నెంబర్ 18 తీసుకువచ్చి కుల గణన చేపట్టినట్లు తెలిపారు. సందీప్‌కుమార్ సుల్తానియా, ఉత్తమ్ కుమార్‌రెడ్డి కుల గణను మమ అనిపించారని విమర్శించారు. కేంద్ర ప్రకటించిన 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 13.8శాతం జనాభా పెరుగుతుందని ఏ లెక్క చూసినా 4 కోట్ల 25 లక్షల జనాభా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3.54 కోట్ల జనాభా ఉందని, మరో 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని, మొత్తం 3.70 కోట్ల జనాభాగా చెబుతున్నారని, రాష్ట్ర జనాభాను తక్కువగా చూపించడానికి కారణం బీసీ జనాభా పెరుగలేదని చూపించడానికోసమేనని విమర్శించారు. బీసీలకు 46శాతం వాటా అని చెప్పి అన్యాయం చేయడం కాదు.. అవమానం చేశారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. కులగణన ముసాయిదాలో పేరుందో లేదో చూసుకునేందుకు ముసాయిదాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, పార్లమెంట్‌లో చట్టం కోసం కలిసి వస్తుందని అన్నారు. బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.