మోడీ ప్రభుత్వంపై ఉపాధ్యాయుల విశ్వాసం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:33 AM
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు విశ్వాసం చూపించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

- కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
మోదీ ప్రభుత్వంపై ఉపాధ్యాయుల విశ్వాసం
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
భగత్‌నగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు విశ్వాసం చూపించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పాలనను నమ్మి ఓట్లు వేస్తామని, బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను మినహాయింపును మరిచిపోబోమని ప్రచారంలోనే ఉపాధ్యాయుల స్పష్టం చేసి ఓటింగ్‌లో నిరూపించారన్నారు. విజయం కోసం తపస్ నాయకత్వం కష్టపడిన తీరును చూసి ప్రస్తుత ఉపాధ్యాయ సంఘాల్లో అలజడి మొదలైందన్నారు. శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతున్న మోదీపై అభిమానాన్ని ఉపాధ్యాయులు ఎన్నికల్లో ప్రదర్శించారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బీజేపీని ఓడించేందుకు అనేక కుట్రలు చేశాయన్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో కోట్ల రూపాయలు పంచినా ఉపాధ్యాయులు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటాన్ని ఉపాధ్యాయులు మరిచిపోలేదన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలన్నారు. పీఆర్సీ, ఐదు డీఏలు, గ్రాట్యుటీ, పెన్షన్ లాంటి అనేక విషయాలను విస్మరిస్తున్న తీరు బాగాలేదన్నారు. వయో పరిమితిని కేసీఆర్ పెంచారని, అదే విధానాన్ని అవలంబిస్తే ఆ ప్రభుత్వానికిపట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎమెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసినా నిరాశ ఎదురైందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నాయకత్వం, దిశా నిర్దేశంలో ఇది మూడో విజయమన్నారు. తెలంగాణలో బీజేపీ శకం ప్రారంభమైందని, కిషన్‌రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. వార్డు సభ్యుడి నుంచి మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్, మేయర్ ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అద్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.