Share News

సర్వే సవాల్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:33 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది.

సర్వే సవాల్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టిన క్రమంలో లబ్ధిదారుల్లో ఆశలు కలిగాయి. మరోవైపు సర్వేలో అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తే జిల్లా కలెక్టర్‌ స్థాయి నుంచి కిందిస్థాయి వరకు చర్యలు ఉంటాయని మంత్రులు హెచ్చరించిన నేపఽథ్యంలో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాలుగా మారింది. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టనున్న క్రమంలో సర్వేకు సంబంధించిన షెడ్యూల్‌ జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వేకు సంబంధించి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కార్యాచరణ రూపొందించి మార్గనిర్దేశనం చేశారు. గురువారం ప్రారంభమైన సర్వే ఈనెల 20వ తేదీ వరకు గ్రామస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ, వ్యవసాయ, హౌసింగ్‌, బృందాలు అధికారులు ఉద్యోగులు సర్వే చేయనున్నారు. సర్వే ప్రకారం తయారైన ముసాయిదా జాబితాలను 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను చేసి 25న పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు పథకాలు చేరువ కానున్నాయి.

భరోసాకు భూ సర్వే

రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. యాసంగి నుంచి రైతు భరోసాతో పాటు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అందించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుభరోసా కింద ఎకరానికి రూ 6వేల చొప్పున అందించనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వేను చేపట్టనున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలో గతంలో 12 విడతలుగా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో వానాకాలం, యాసంగి సీజన్లలో 1,29,407 మంది రైతులకు రూ 260.20 కోట్లు చెల్లించారు. గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం భూమి సాగులో ఉన్న లేకపోయినా పెట్టుబడి సాయం అందించేవారు. ఈ సారి ప్రభుత్వం రైతు భరోసాలో వ్యవసాయ భూములకు మాత్రమే భరోసాను అందించనున్నారు. వానాకాలం సీజన్‌లో 2.42 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.77 లక్షల ఎకరాల వరకు జిల్లాలో సాగు చేస్తున్నారు. జిల్లాలో రాళ్లు, రప్పలు, రియల్‌ వెంచర్లు, గుట్టలు, నాలా కన్వనర్షన్‌భూములకు భరోసా దూరం కానుంది. వీటిని గుర్తించే దిశగా క్షేత్ర స్థాయిలో సర్వేను చేపట్టనున్నారు. జిల్లాలో వ్యవసాయ గణన ప్రకారం 171 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నంబర్ల అఽధారంగా 1,,32,574 మంది రైతుల వద్ద 1,09,983 హెక్టార్ల భూమి ఉన్నట్లుగా గుర్తించారు. ఈ వివరాలను కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకోనున్నారు. ఎంతమందికి లబ్ధి చేకూరుతుందోననే అశలతో రైతులు ఉన్నారు.

ఆత్మీయ భరోసా ఎందరికో?

ప్రభుత్వం కొత్తగా భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మఆఅత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు ఉండి ఏడాదిలో 20 రోజుల ఉపాధి పనులకు వెళ్లిన భూమిలేని వ్యవసాయ కూలీలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఏడాదికి రూ. 12 వేలు రెండువిడతలుగా అందించనున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కూలీలతో పాటు కౌలు చేసుకునే వారు దాదాపు 80 వేల మంది ఉన్నారు. జిల్లాలో 98 వేల జాబ్‌కార్డులు ఉండగా రెండు లక్షల వరకు కూలీలు ఉన్నారు. వీరిలో అర్హులను గుర్తించనున్నారు. డీఆర్‌డీఏకు సంబంధించి మండల, గ్రామస్థాయి బృందాలు అర్హులను గుర్తిస్తున్నారు.

రేషన్‌ కార్డులపై ఆశలు...

కొత్త రేషన్‌ కార్డుల కోసం దశాబ్ధకాలంగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అరు గ్యారంటీల దరఖాస్తుల సందర్భంగా కూడా రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40 వేలమంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సామాజిక అర్థిక సర్వేలో జిల్లాలో తొమ్మిది వేల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డులు లేవని గుర్తించారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. దీనికి తోడుగా మార్పులుచేర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు 20,606 పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్లు, కోడళ్ల పేర్లు చేర్చాలంటూ వేలాది మంది కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్వే ద్వారా కొత్త కార్డులకు మోక్షం కలుగుతుందని అర్హుల జాబితాను సిద్ధం చేస్తారని భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం లక్షా 73 వేల 728 రేషన్‌కార్డులు ఉన్నాయి.

ఇందిరమ్మ ఇళ్లకు కసరత్తు...

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సర్వే మొదలైంది. పట్టణాల్లో రూ. రెండు లక్షలు, గ్రామాల్లో రూ 1.50 లక్షల అదాయం ఉండి ఇళ్లు లేని పేదలు, ఖాళీ స్థలం ఉండి నిర్మించుకోవడానికి ముందుకు వచ్చిన వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు, ఇతరులకు రూ. 5 లక్షలు నిధులు ఇస్తారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాలో సర్వే ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలో 1,07,398 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 97 శాతం సర్వేను పూర్తి చేశారు. వీటికి సంబంధించిన పరిశీలన పూర్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, అత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ, లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపికలో అధికారులకు కత్తిమీద సాముగానే మారిందని చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కార్యాచరణ

- కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేసే దిశగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, మార్గనిర్దేశనం చేశారు. సర్వే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ అత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై మార్గదర్శకాలకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అందించారు. రైతు భరోసాకు వ్యవసాయ యోగ్యమైన భూమిని మాత్రమే పరిశీలించాలని, వ్యవసాయ యోగ్యం కాని భూములను భూభారతి నుంచి తొలగించాలని సూచనలు చేశారు.

ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకానికి రెవెన్యూ గ్రామంలోనీ గ్రామపంచాయతీల వారీగా మ్యాపింగ్‌ చేసి 20 రోజులు పనిచేసిన ఉపాధిహామీ కూలీల జాబితాను తీసుకోని ఆధార్‌ ట్యాగింగ్‌ ప్రకారం భూమిలేని కుటుబాలను పరిశీలించాలని సూచించారు.

సామాజిక అర్థిక సర్వే కింద జిల్లాలో 9 వేల కుటుంభాలకు తెల్లరేషన్‌ కార్డులు లేవని తేలిందని మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు గ్రామ, మున్సిపల్‌, వార్డు సభల ద్వారా అర్హుల జాబితాను అమోదింపజేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొసీడింగ్‌లు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అత్యంత పేదలను మొదటి విడతలో గుర్తించాలని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులకు పలు విషయాలపై మార్గనిర్దేశనం చేశారు.

Updated Date - Jan 17 , 2025 | 01:33 AM