విజయోస్తు..!
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:47 AM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో 9,310 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈసారి ఒక్క నిముషం నిబంధనలో సడలింపు ఇచ్చారు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో 9,310 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈసారి ఒక్క నిముషం నిబంధనలో సడలింపు ఇచ్చారు. ఐదు నిముషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. దీంతో ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులకు అవకాశం ఉంది. 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారు తమకు ఇచ్చిన పత్రంపై తమ వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను 8.10 గంటల నుంచే అనుమతిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ముందే కేంద్రాలకు చేరుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఫ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి దారి...
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈసారి కొన్ని మార్పులు తీసుకవచ్చారు. పరీక్ష కేంద్రం వివరాలను హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్ రూపంలో అందించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ వస్తుంది. దాని ఆధారంగా సులభంగా కేంద్రానికి వెళ్లవచ్చు. హాల్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయ్యే తేది, హాల్ టికెట్ నంబర్లు, విద్యార్థుల సెల్‌ఫోన్‌కు మేసేజ్ రూపంలో వచ్చాయి. దీంతో పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవడానికి ఇబ్బంది లేకుండా మారింది.
ఫ నిఘా నీడలో పరీక్షలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగే పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ను అమల్లో ఉంచారు. వంద మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. పరీక్ష సమయంలో జిరాక్స్, కంప్యూటర్ కేంద్రాలను మూసివేయించనున్నారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల వద్దనే తెరవనున్నారు. ఎలక్ర్టానిక్ వస్తువులను అనుమతించరు. ఈసారి చేతి గడియారాలకు కూడా అనుమతి లేదు. ఇన్విజిలేటర్ ప్రతి 30 నిముషాలకు సమయాన్ని తెలియజేస్తారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 300 మంది సిబ్బందిని నియమించారు. 16మంది ఛీప్ సూపరింటెండెంట్లు, మరో 16మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 5మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, ముగ్గురు కస్టోడియన్‌లను నియమించారు. 250 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. వేసవి ఉండడంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం, ఓఆర్‌ఆర్ ప్యాకెట్లు వంటివి అందుబాటులో ఉంచారు.
ఫ జిల్లాలో 9,310 మంది విద్యార్థులు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16కేంద్రాల ద్వారా ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ప్రైవేటు కాలేజీల్లో కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచిఒ 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 8.10 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయంకంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తి చేసినా పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు. ఇతర గ్రామాల నుంచి పరీక్షలకు వచ్చే విద్యార్థుల కోసం బస్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 9,310 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,065 మంది రెండో సంవత్సరం విద్యార్తులు 4,245 మంది ఉన్నారు.