Share News

ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:18 AM

ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గర పడుతుండడంతో మున్సిపల్‌ అధికారులు ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించారు.

ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గర పడుతుండడంతో మున్సిపల్‌ అధికారులు ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. మార్చి 31లోగా వంద శాతం పన్నులు వసూలు చేయాలనే లక్ష్యం నిర్దేశించడంతో లక్ష్య సాధనకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటి వరకు హుజూరాబాద్‌ మున్సిపాలిటీ 92.45 శాతం ఆస్తి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 91.72 శాతం పన్నులను వసూలు చేసి జమ్మికుంట రెండో స్థానంలో నిలువగా, కరీంనగర్‌ కార్పొరేషన్‌ 54.4 శాతం వసూళ్లతో 66వ స్థానంలో, చొప్పదండి 54.22 శాతంతో 69వ స్థానంలో నిలిచింది. మార్చి 31లోగా అన్ని మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తిపన్నులను వసూలు చేయాలని మున్సిపల్‌ ఉన్నతాధికారులు ఆదేశించడంతో మున్సిపల్‌ అధికారులు వారం, పదిరోజులుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

కరీంనగర్‌లో లక్ష్యానికి దూరంగా..

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో గత ఏడాది 94 శాతం పన్నులు వసూలు కాగా మార్చి 6వ తేదీ వరకు ఈ యేడాదిలో కేవలం 54.4 శాతం మాత్రమే ఆస్తి పన్నులు వసూలయ్యాయి. సమగ్ర కుటుంబ సర్వే, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, ఇతరత్రా అదనపు విధులను మున్సిపల్‌ ఉద్యోగులకు అప్పగించడంతో ఆ ప్రభావం ఆస్తిపన్నుల వసూళ్లపై పడింది. మిగిలిన 25 రోజుల్లో వందశాతం పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నగరపాలక సంస్థలోని 60 డివిజన్లతోపాటు ఇటీవల విలీనం చేసిన కొత్తపల్లి మున్సిపాలిటీ, చింతకుంట, మల్కాపూర్‌, బొమ్మకల్‌, గోపాల్‌పూర్‌ గ్రామపంచాయతీల ఆస్తిపన్నుల వసూళ్ల బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు అప్పగించారు. ఒక్కో వార్డు ఆఫీసర్‌కు ఆస్తి పన్నుల వసూళ్లకు సంబంధించిన డివైజ్‌లను అప్పగించారు. వారికి కేటాయించిన డివిజన్లలో ఇంటింటికి వెళ్లి పన్నులు చెల్లించాలంటూ ఇంటి యజమానులను కోరుతున్నారు. 31లోగా పన్నులు చెల్లించకుంటే రెండు శాతం వడ్డీ పడుతుందని, వడ్డీభారం లేకుండా తమ వద్ద చెల్లించి రశీదు పొందాలని కోరుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లోకానీ, మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కానీ ఆస్తిపన్నులను స్వీకరిస్తున్నారు.

విలీన ప్రాంతాల్లో పేరకుపోయిన బకాయిలు

భువన్‌ యాప్‌ ద్వారా 2024 అక్టోబరు నుంచి నిర్ధారించిన ఆస్తి పన్నులను సవరించి వసూలు చేస్తున్నారు. గతంలో చేసిన కట్టడాలకు సంబంధించిన కొలతలు, ఇళ్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కమర్షియల్‌ టాక్సులను వసూలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ఆస్తిపన్నులు పెరిగాయంటూ గగ్గోలు పెడుతున్నారు. కొలతల ప్రకారంగా ఆస్తి పన్ను నిర్ధారిస్తామని, ఎక్కువ పన్ను వచ్చినట్లనిపిస్తే దరఖాస్తు చేసుకోవాలని, తిరిగి కొలతలు తీసుకొని పన్నులను సవరిస్తామని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 86,831 నివాస, వాణిజ్య గృహాలు ఉండగా వాటి ద్వారా 50.57 కోట్ల ఆస్తిపన్నుల ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు కేవలం 27.51 కోట్ల రూపాయల పన్నులు మాత్రమే వసూలు అయ్యాయి. ఇటీవల విలీనమైన చింతకుంట, మల్కాపూర్‌, బొమ్మకల్‌, గోపాల్‌పూర్‌ గ్రామాలతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీల్లో కోట్లలోనే బకాయిలు పేరుకు పోయాయి. దీంతో ఆస్తిపన్నుల డిమాండ్‌ పెరుగడమే కాకుండా వసూళ్ల శాతం తగ్గిపోతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆస్తిపన్నులను వసూలు చేస్తున్నారు. మరోవైపు 60 డివిజన్లలోని మొండి బకాయిలను వసూలు చేసేందుకు అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు (ఆర్‌ఆర్‌) చట్టాన్ని అమలు చేసి ఆస్తులను జప్తు చేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆస్తిపన్ను బకాయిల చిట్టాను ఆయా ఇళ్ల ఎదుట అతికించి ఒత్తిడి తెస్తున్నారు. వార్డు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ప్రతిరోజు డివిజన్లలో ఇంటింటికి వెళ్లి పన్నులను వసూలు చేసి వాటి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు, ఇతరత్రా పన్నులను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలంటూ హోర్డింగ్‌లు, మైకుల ద్వారా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వందశాతం ఆస్తిపన్నులు వసూలు చేయాలని నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించడంతో కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, డిప్యూటీ కమిషనర్‌ స్వరూపరాణి ప్రతిరోజు ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టిసారిస్తూ వార్డు అధికారులతో సమావేశాలను నిర్వహించి, సమస్యలుంటే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.

వందశాతం పన్నులను వసూలు చేసేందుకు కృషి

- డిప్యూటీ కమిషనర్‌ స్వరూపరాణి

నగరపాలక సంస్థలో వందశాతం ఆస్తిపన్నులను మార్చి 31లోగా వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని డిప్యూటీ కమిషనర్‌ స్వరూపరాణి తెలిపారు. పట్టణ ప్రజలు ఆస్తిపన్నులను, బకాయిలను వెంటనే చెల్లించి వడ్డీ భారం పడకుండా చూసుకోవాలని, నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. బకాయిలను చెల్లించకుంటే మున్సిపల్‌ ఆర్‌ఆర్‌ చట్ట ప్రకారంగా ఆస్తులను జప్తు చేస్తామని, అంతవరకు రాకుండా పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు.

Updated Date - Mar 07 , 2025 | 01:18 AM