మహిళా సంఘాలకు సౌర వెలుగులు
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:46 AM
మహిళా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది.

జగిత్యాల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది. జిల్లాలో పది యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా రెండు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు మండలాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. అనుమతులు వచ్చిన అనంతరం జిల్లాలో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో తొలి విడతగా రెండు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సంబంధిత అధికార వర్గాలు అంటున్నాయి.
ఫతొలి విడతగా రెండు సోలార్ ప్లాంట్లు
మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు పల్లెల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైతులకు తక్కువ ఖర్చుతో విద్యుత్తును అందించడానికి కేంద్రం సోలార్ విద్యుత్ తయారీని ప్రోత్సహిస్తోంది. మహిళా సంఘాలతో పాటు రైతులకు అవకాశం కల్పిస్తోంది. నాలుగు ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమిలో సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి ఉన్న మండల సమాఖ్యలకు అవసరమైన ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం సమకూరుతుంది. జిల్లాలోని మండల సమాఖ్యలకు అవగాహన కల్పించిన అధికారులు ఆ దిశగా ఆసక్తి చూపిన సంఘాలతో ప్రతిపాదలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతులు వచ్చిన వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
ఫప్లాంట్ల ఏర్పాటు ఇలా..
జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు సోలార్ ప్లాంట్‌లను పెగడపల్లి మండలం నందగిరి, జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామంలో సూర్యతేజ గ్రామ మహిళా సమాఖ్య, సరోజిని నాయుడు మహిళా సమాఖ్య, తాటిపల్లి గ్రామంలో అభ్యుదయ మహిళా సమాఖ్య, చైతన్య స్వయం సహాయక మహిళా సంఘాలను ఎంపిక చేశారు. తాటిపల్లిలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు సర్వే నంబరు 264, 320, 334, 338, 339, 340, 348, 49, 534, 535, 36, 541లలో నాలుగు ఎకరాల స్థలాన్ని, నందగిరిలో సర్వే నంబరు 194, 196లలో నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రెవెన్యూ, డీఆర్‌డీఏ విద్యుత్, రెడ్కో, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేపట్టి ఎంపిక చేశారు. ఈ రెండు స్థలాలను ఆ గ్రామ సమాఖ్యలకు కేటాయిస్తూ ప్రత్యేక ఐడీ (రిజిస్ట్రేషన్) నంబర్లను కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లాంట్ నుంచి సమీపంలోని సబ్‌స్టేషన్ వరకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు మళ్లించి రైతులకు సరఫరా చేయనున్నారు. 25 సంవత్సరాల పాటు నిర్వహణను ఆయా సంఘాలే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ సంవత్సరం ఆయా సంఘాలకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరి ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది.
ఫ30 శాతం సబ్సిడీ
ఒక్కో ప్లాంట్‌ను రూ.1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ అందజేయనుంది. బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటు చేయనున్న సోలార్ యూనిట్లకు లబ్ధిదారు వాటాను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ప్లాంట్‌లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరిగేలా సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. డీపీఆర్‌లు పూర్తయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 8న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డీపీఆర్‌లు సిద్ధం కానట్లయితే ప్రారంభంలో మరికొంత జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఫఆర్థిక భారం తగ్గించేలా..
జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలు మినహా ప్రాజెక్టులు, ఇతర కాలువలు అంతగా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో బోరు బావుల ఆధారంగా పంటల సాగు చేస్తున్నారు. విద్యుత్ ఆధారిత బోరు మోటార్ల ద్వారా పంటలకు పలు ప్రాంతాల్లో నీరు అందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి విద్యుత్ సరఫరా ఉచితంగా అందజేస్తోంది. ఇందుకు గానూ ప్రభుత్వంపై ప్రతినెల రూ.కోట్లలో ఆర్థిక భారం పడుతోంది. దీన్ని అధిగమించడంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూతనందించేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3.13 పైసల చొప్పున ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో విద్యుత్ ఖర్చు తక్కువై ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గనుండడతో పాటు మహిళలకు ఉపాధి లభించనుంది.
మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
-రఘువరన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
జిల్లాలో పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలి విడతగా రెండు ప్లాంట్లు ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం. జిల్లాలోని తాటిపల్లి, నందగిరి గ్రామాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి గ్రామ మహిళా సమాఖ్యల గుర్తింపుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేశాం. ప్రభుత్వం నుంచి వీటి ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా పనులు ప్రారంభిస్తాం. సోలార్ ప్లాంట్లు మహిళల ఆర్థికాభివృద్ధి తోడ్పడనున్నాయి.