siricilla : ‘స్థానిక’ ఎన్నికలపై బీసీల నజర్..
ABN , Publish Date - Feb 09 , 2025 | 01:14 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) కుల గణనలో బీసీ జనాభా లెక్కలు తేలడంతో రిజర్వేషన్ల అమలుపై చర్చ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలుచేయాలని లేదా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ పెరుగుతోంది.
- గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీల హవా
- ఈసారి ఎన్నికల్లో బీసీ చైతన్యంపై ఆసక్తి
- కలిసిరానున్న బీసీ రిజర్వేషన్లు
- జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో 44 మంది బీసీ అభ్యర్థుల గెలుపు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కుల గణనలో బీసీ జనాభా లెక్కలు తేలడంతో రిజర్వేషన్ల అమలుపై చర్చ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలుచేయాలని లేదా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ పెరుగుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియ ఏలా ఉన్నా బీసీల్లో చైతన్యం, ఎన్నికల్లో పట్టు సాధించాలనే దృష్టి మాత్రం మొదలైంది. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీపడి ఉన్నత సామాజిక వర్గాల పెద్దలపై గెలుపొందారు. ఈక్రమంలో ప్రస్తుతం సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికల ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ నాయకులు రాబోయే రిజర్వేషన్లను అందిపుచ్చుకోవడంతో పాటు జనరల్ స్థానాల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోటాను చట్టబద్ధంగా పెంచేందుకు చిక్కుముడులు ఉండడంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈసారి బీసీలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఆశలు మాత్రం పెరిగాయి.
గత ఎన్నికల్లో 80 గ్రామపంచాయతీల్లో బీసీలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఐదు గ్రామ పంచాయతీలతో కలిపి ప్రస్తుతం 260 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా, 252 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 56 స్థానాలు, ఎస్సీలకు 51, ఎస్టీలకు 30, జనరల్ స్థానాలు 115 రిజర్వ్ చేశారు. ఇందులో జనరల్ స్థానాల్లో 24 మంది బీసీలు గెలుపొందారు. 252 స్థానాల్లో బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 80 మంది బీసీలు గెలుపొందారు. ప్రస్తుతం జిల్లాలోని 260 గ్రామపంచాయతీల్లో మొదటి విడతలో 137 సర్పంచ్‌లు, 1888 వార్డులు, రెండవ విడతలో 123 సర్పంచ్‌లు, 1080 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఓటరు జాబితాలు, బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌లు సిద్ధం చేశారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీల్లోనూ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కూడా జనరల్ స్థానాల్లో బీసీల హవా కొనసాగింది. 12 జడ్పీటీసీ స్థానాల్లో ఆరు జనరల్ స్థానాలు, బీసీలు రెండు, ఎస్సీలు మూడు, ఎస్టీలు ఒకటి రిజర్వ్ చేశారు. ఇందులో జనరల్ స్థానాల్లోనే ముగ్గురు గెలుపొందారు. రిజర్వేషన్‌తో కలిపి ఐదుగురు బీసీలు గెలుపొందారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్ స్థానాలు 64, బీసీలకు 25, ఎస్టీలకు 6, ఎస్సీలకు 28 స్థానాలు రిజర్వ్ చేశారు. ఇందులో జనరల్ స్థానాల్లో 17 బీసీ అభ్యర్థులు గెలుపొందారు. రిజర్వేషన్‌తో కలుపుకొని 42 ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీగా ఉన్నారు. ఈసారి జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు పెరగలేదు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు సర్పంచ్ ఎన్నికలకంటే ముందు పరిషత్ ఎన్నికలు వస్తాయని తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్లతో అవకాశాలు..
బీసీల జనాభా ఎక్కువగా ఉన్నా రాజకీయంగా వెనకబడుతున్న నేపథ్యంలో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తొలిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. బీసీ రిజర్వేషన్లతో రాజకీయ చైతన్యంగా నాయకుల ఎదుగుదలకు తోడ్పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో 20శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఆ తరువాత బీసీ సంఘాలు రిజర్వేషన్ల పెంపుకోసం పోరాటాలు చేయడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బీసీల రిజర్వేషన్ 34 శాతానికి తెచ్చారు. సుప్రీం కోర్టు రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాట కూడదని పరిమితి విధించడంతో 2019లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 22 శాతానికి కుదించి ఎన్నికలు నిర్వహించింది. బీసీలకు అన్యాయం జరిగినా జనరల్ స్థానాల్లో సత్తా చాటారు. ఈక్రమంలో శాసనసభ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కులగణన నిర్వహించింది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు లెక్క తేలిపోతే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
బీసీ అభ్యర్థులకు పార్టీల్లో డిమాండ్..
స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో బీసీ అభ్యర్థులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. బీసీల్లో వచ్చిన చైతన్యంతో పోటీకి సిద్ధమవుతున్న బీసీ నాయకుల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి అంచనాలు వేస్తున్నారు. రిజర్వ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీ నేతలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్‌కు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారుతుందని భావిస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఉన్న బీసీ నేతలను జారవిడుచుకోవద్దని చూస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జడ్పీటీసీల్లో 12 స్థానాల్లో 11 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. 123 ఎంపీటీసీ స్థానాల్లో 71 బీఆర్‌ఎస్, 7 బీజేపీ, కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందగా, 25స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఈసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో ఫలితాలు తారుమారు అవుతాయని భావిస్తున్నారు. ఎన్నికల సందడి కూడా మొదలైన నేపథ్యంలో పార్టీలు స్థానిక ఎన్నికల వైపు దృష్టి పెట్టాయి.