Share News

siricilla : గంజాయి.. ఎంజాయ్‌..

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:18 AM

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) జిల్లాలోని యువత గంజాయి మత్తులో ఎంజాయ్‌ చేస్తున్నారు. గంజాయి అలవాటు నుంచి దూరం చేయడానికి ప్రచారం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు పొరుగు రాష్ట్రాల నుంచి నిఘా కన్నుగప్పి వస్తూనే ఉంది.

siricilla :  గంజాయి.. ఎంజాయ్‌..

- మత్తులో జిల్లాలోని యువత

- మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసుల సీరియస్‌

- గడిచిన 50 రోజుల్లో 48 మంది అరెస్ట్‌

- గత సంవత్సరం 41 కిలోల గంజాయి పట్టివేత

- నార్కోటిక్‌ జాగిలాలతో తనిఖీలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలోని యువత గంజాయి మత్తులో ఎంజాయ్‌ చేస్తున్నారు. గంజాయి అలవాటు నుంచి దూరం చేయడానికి ప్రచారం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు పొరుగు రాష్ట్రాల నుంచి నిఘా కన్నుగప్పి వస్తూనే ఉంది. జిల్లా పోలీస్‌ యంత్రాంగం మత్తు నియంత్రణకు సీరియస్‌గా సమరం ప్రకటించింది. గంజాయికి అలవాటుపడిన యువతకు కౌన్సెలింగ్‌ ఇస్తూనే జిల్లాలో విసృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో విభిన్న రూపాల్లో గంజాయి సిగరెట్లు, చాక్లెట్లు, తినుబండారాల్లో సైతం గంజాయిని ఉంచి విక్రయుస్తున్న సంఘటనలు వెలుగు చూశాయి. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ నేతృత్వంతో గంజాయిరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో గంజాయి పరీక్షల నిర్వహణకు పోలీస్‌ స్టేషన్‌లకు ప్రత్యేక కిట్‌లను కూడా అందించారు. గడిచిన 50 రోజుల్లోనే పటిష్ట నిఘాతో జిల్లాలో 22 కేసులలో 48 మందిని ఆరెస్ట్‌ చేసి 2కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో పెరుగుతున్న కేసులు...

మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్స్‌ క్లబ్‌లు ఏర్పాటుచేయడంతో పాటు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌ నిర్మూలనపై ర్యాలీలు, 5 కె రన్‌లు వంటివి కార్యక్రమాలు చేపడుతున్నా గంజాయి కేసులు మాత్రం పెరుగుతున్నాయి. 2021లో 22 కేసుల్లో 71 మందిని ఆరెస్ట్‌ చేసి 56.36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2022లో 16కేసుల్లో 51 మందిని ఆరెస్ట్‌ చేసి 35 కిలోల 09 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. 2023లో 61 కేసుల్లో 141 మందిని ఆరెస్ట్‌ చేసి 71 కిలోల 794 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం 2024లో 93 కేసుల్లో 211 మందిని ఆరెస్ట్‌ చేసి 41 కిలోల 272 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి 141 హిస్టరీ షీట్స్‌ ఓపెన్‌ చేశారు. ఈ సంవత్సరం ఇప్పటికి 22 కేసుల్లో 48 మందిని ఆరెస్ట్‌ చేసి 2 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

జాగిలాలతో తనిఖీలు..

జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అరికట్టడానికి విస్తృత అవగాహన కార్యక్రమాలతో పాటు సిగరెట్లు, చాక్లెట్లు, ఇతర తినుబండారాలతో గంజాయిని ఉంచే అక్రమాలపై నిఘా పెంచి నార్కోటిక్‌ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. గంజాయి కిట్ల సహాయంతో యూరిన్‌ టెస్ట్‌ల ద్వారా గంజాయిని సేవించే వారిని గుర్తించి గంజాయిని అందిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

జిల్లాలో బ్రేక్‌ పడినా... పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా

జిల్లాలోని అటవీ గ్రామాల్లో కంది, పత్తి, బంతి, పంటల్లో గంజాయిని అంతర్‌పంటగా గతంలో సాగు చేసేవారు. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుల నిరంతర దాడులతో పాటు గంజాయి విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపడంతో గంజాయి సాగుకు బ్రేక్‌ పడింది. గంజాయి సాగుకు తెరపడిందని భావించిన క్రమంలోనే పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి జిల్లాకు గంజాయి గుట్టుచప్పుడు కాకుండా రవాణా అవుతోంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామల నుంచి జిల్లాకు గంజాయి సరఫరా జరుగుతూనే ఉంది. జిల్లాలో గంజాయి నియంత్రణకు 8712656392 నంబర్‌కు కాల్‌ చేసి వివరాలు అందించాలని, సమాచారం గోప్యంగా ఉంచుతామని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. గంజాయి నియంత్రణపై పోలీస్‌ యంత్రాంగం నిఘా పెంచడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.

గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్‌ డ్రైవ్‌.

- అఖిల్‌మహాజన్‌, ఎస్పీ

గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్‌ డ్రైవ్‌లు, నార్కోటిక్‌ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. గంజాయి అక్రమ రవాణాపై గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి కిట్ల సహాయంతో యూరిన్‌ టెస్టులు నిర్వహిస్తున్నాం. గంజాయి విక్రయించినా, సాగు చేసినా, రవాణా చేసేవారి సమాచారాన్ని అందజేయాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

Updated Date - Feb 24 , 2025 | 01:18 AM