sicilla : ముహూర్తాలకు వేళాయె..
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:25 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఆదివారం నుంచి మొదలయ్యాయి. ఎవరిని కదిలించినా మాఘమాసం పెళ్లి ముహూర్తాల్లోనే

- మాఘమాసంలో మోగనున్న పెళ్లి భాజాలు
- మే 23 వరకు శుభఘడియలు
- కిటకిటలాడుతున్న వస్త్ర దుకాణాలు
- ముందస్తుగా కల్యాణ మండపాలు బుకింగ్
- ఫంక్షన్ హాల్స్ నుంచి భోజనాల వరకు అన్నీ ప్యాకేజీలే
- ఎట్రాక్షన్ కోసం పాత కాలపు సాంప్రదాయాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఆదివారం నుంచి మొదలయ్యాయి. ఎవరిని కదిలించినా మాఘమాసం పెళ్లి ముహూర్తాల్లోనే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మే 23 వరకు ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ మే 28న జ్యేష్ట మాసం ప్రారంభం అవుతుంది. దీంతో జిల్లాలో పెళ్లి సందడి మొదలైంది. వీటి కోసం ఇప్పటికే ఫంక్షన్‌హాళ్ల నుంచి మొదలుకొని క్యాటరింగ్, పెళ్లి మండపాలు, బ్యాండ్ మేళాలు, పురోహితుల వరకు బుకింగ్‌లు జరిగిపోతున్నాయి. ఆభరణాలు, బట్టల దుకాణాల్లో పెళ్లిసందడి మొదలైంది. మరోవైపు హంగామా... ఆర్భాటాలు... మూడుముళ్ల బంధం మూడు తరాలు చెప్పుకునే విధంగా ఖర్చుకు వెనుకాడడం లేదు. ఎట్రాక్షన్ కోసం పాత కాలపు సంప్రదాయాలను చూపుతున్నారు. ప్రత్యేకతను చాటుకోవడానికి వివాహ వేడుకల్లో కొత్తకొత్త అంశాలు చేరుస్తున్నారు. వెడ్డింగ్ కార్డు నుంచి భోజనాల ప్లేట్ల వరకు ఏకోఫ్రెండ్లీని జత చేస్తున్నారు. ఇక భారీ సెట్టింగ్‌లు... డ్యాన్స్‌లు.... సంగీతం... అతిథులకు పోటీలు.... పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్లిని ఆరురోజుల పాటు జరిపించేవారు. ఇప్పుడు అర రోజుకు పరిమితం చేశారు. ఆకాశమంత పందిరి వేసి పెళ్లికొడుకు బంధువులు ఇరువురు ఒకేచోట ఏదో ఒక ఫంక్షన్ హాల్‌లో పెళ్లిళ్లను మాత్రం అరరోజులోనే పూర్తి చేస్తున్నారు. గతంలో పెళ్లి ఉందంటే బంధుమిత్రులందరూ కలిసి వారం రోజుల పాటు ఇంట్లో సందడి చేస్తూ అందరు కలిసి వంటలు చేయడం వంట వాళ్లు వస్తే వారికి సహాయం చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అంతా క్యాటరింగ్ పద్ధతే వచ్చింది.
ముహూర్తాల మాఘమాసం...
మాఘమాసం ముహూర్తాల మాసంగా చెప్పుకోవచ్చు. చంద్రమానం ప్రకారం 11వ మాసంగా మాఘమాసం మొదలవుతుంది. కార్తీక మాసంలో దీపారాధాన ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానాలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. సూర్యభగవానుడికి పూజలు చేయడం విశిష్టమైంది. అంతేకాకుండా మాఘమాసంలో రథసప్తమి, శ్రీపంచమి, వరుణషష్టి, భీష్మాష్టమి, భీష్మా ఏకాదశి, పూర్ణిమతో పాటు పలు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వధూవరుల జన్మ నక్షత్ర బలం ఆధారంగా ముహూర్తాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఫిబ్రవరిలో 2, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 20, 22, 23
మార్చి మాసంలో 1, 2, 6, 7, 12, 14, 15, 16,
ఏప్రిల్‌లో 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23 (29, 30, వైశాఖం)
మేలో 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23 (28 జ్యేష్టమాసం) తేదీలో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
స్టేటస్ సింబల్‌గా వేడుకలు
సాంప్రదాయబద్ధంగా సాగిపోయే పెళ్లివేడుక స్టేటస్‌కు సింబల్‌గా మారింది. పెళ్లి కూడా ఒక వ్యాపారంలో భాగంగా సంతరించుకుంది. పెళ్లి కూతురు ధరించే దుస్తుల దగ్గర నుంచి ఆమెను అత్తవారింటికి పంపే వరకు, పెళ్లి కొడుకుకు కావాల్సిన వస్తువులను, మండపం అలంకరణలను ఇలా ప్రతీ ఒక్కటి చేసి పెట్టడానికి ఎన్నో సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఒక పెళ్లి ఖర్చు రూ. 20 లక్షల నుంచి రూ. 50లక్షల వరకు కూడా అవుతోంది. పెళ్లి పనులు చేసి పెట్టేందుకు మనుషులు రెడిమేడ్‌గా లభిస్తున్నారు. చివరకు పెళ్లి కూతురు బంధువులు పట్టుకురావాల్సిన పెళ్లి వస్తువులు కూడా రెడిమేడ్‌గా వచ్చే అమ్మాయిలే రకరకాల వస్త్రాలు ధరించి మోసుకెళ్లడం జరుగుతుంది.
పల్లకీలు, గుర్రపు బగ్గీలు...
పాతకాలంలో పెళ్లి కూతురును పల్లకిలో, పెళ్లి కొడుకును గుర్రంపైన ఊరేగించే వారు. మధ్య కాలంలో అవి అంతరించిపోయాయి. ప్రస్తుతం పెళ్లిల్లో ప్రత్యేకతగా ఉండడం కోసం మళ్లీ పల్లకిల్లో పెళ్లి కూతురును, గుర్రం బగ్గిల్లో పెళ్లి కొడుకు, పాత కాలపు జీబు, కార్లను మళ్లీ ఉపయోగంలోకి తీసుకువస్తున్నారు. మరికొందరు కేరళ, గుజరాతీ పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నారు. కేరళ వాయిద్యం, అక్కడి నృత్యాలు, మార్వాడి వేషాధారణలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ప్యాకేజీలతోనే పెళ్లిళ్లు...
పెళ్లంటే బోలెడన్ని పనులు.. బంధువులు ఉండడానికి ఏర్పాట్లతో తలమునకలు.. భోజనాలు... ఇతర పనులకోసం పరుగులెత్తే పరిస్థితి. ముహూర్తం రోజు దగ్గర పడితే మరీ హడావుడి ఒకప్పుడు ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు పెళ్లి పనులు మారిపోయాయి. కూర్చున్న చోటే ఒక్క ఫోన్‌కాల్‌తో పనులన్నీ ప్యాకేజీ రూపంలో మ్యారెజ్ ప్లానర్స్ సిద్ధం చేసి పెడతారు. మన హంగామాకు తగ్గట్టుగా మ్యారేజ్ ప్లానర్స్ వివిధరకాల ప్యాకేజీలను అందిస్తున్నారు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిపెడితే సర్వీస్ చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. పెళ్లి వేడుకను నిర్వహించడానికి వచ్చిన సంస్థలు ఇప్పుడు కోట్లలోనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లిపందిరి నుంచి భోజనాలు, ఫుడ్ స్టాల్స్, వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి ఫొటోలు, ఊరేగింపుతోపాటు పెళ్లికి కావాల్సిన బట్టలు డిజైన్ చేస్తుంటారు. నగలేకాదు అబ్బాయి అమ్మాయిలకు వేసుకోవాల్సిన నగలు, రింగ్స్, మెహందీ, చివరకు చెప్పులను కూడా వారే ఎంపిక చేస్తున్నారు. మ్యారేజ్ ప్లానర్స్ వివిధ రకాల కళాకారులను కూడా పెళ్లిలో ఉపయోగిస్తున్నారు. గతంలో పెళ్లిళ్లను కల్యాణమండపాల్లోనే నిర్వహించేవారు ఆ పరిస్థితి కూడామారి పోయింది. మైదాన ప్రాంతంలో రకరకాల సెట్టింగ్‌లను వేస్తున్నారు. పెళ్లిల్లో మహిళలు పాటలుపాడడం డ్యాన్సులు చేయడం వంటివి నిర్వహిస్తున్నారు. ఎంత వైభవంగా పెళ్లి జరిపించా లన్నా వీరు సిద్ధంగా ఉంటారు. భోజనాల విషయానికి వస్తే బాస్మతి బియ్యంతో బిర్యానీ, మటన్, చికెన్, స్వీట్‌తోపాటు వివిధ ఆహార పదార్థాలతో ప్లేట్ పూర్తిగా నిండి పోతుంది. భోజనం ముగిసిన తరువాత రకరకాల సూప్‌లు, రకరకాల చిరు తిళ్ల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఫొటో జ్ఞాపకాలకు లక్షల్లో ఖర్చు
ప్రతీ కుటుంబంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన వేడుక ఘట్టం... అలాంటి ముఖ్య తంతును మధుర స్మృతులను భద్రపరిచేది ఫొటో ఆల్బమ్. ఇప్పుడు పెళ్లి పుస్తకంగా మన ముందుకు వచ్చింది. వెడ్డింగ్ ఫొటో గ్రఫీ ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఎన్నో జ్ఞాపకాలను పెళ్లిలో చేసే సందడిని సైతం అద్భుతంగా చిత్రీకరించి ఫొటో ఆల్బమ్స్ రూపంలో అందిస్తున్నారు. కేవలం వధూవరుల పెళ్లి తతంగమే కాకుండా వేడుకకు వచ్చిన బంధుమిత్రుల బావోద్వేగాలను సైతం అందంగా చిత్రీకరిస్తున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్ పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్లి వధూవరుల ఫొటోలు తీయించుకుంటున్నారు. ఒక్కపెళ్లి వేడుక ఫొటోల ఆల్బమ్‌కు లక్ష రూపాయల నుంచి రూ.3 లక్షల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు.
దూరమవుతున్న ఆప్యాయతలు...
పెళ్లి స్టేటస్ సింబల్‌గా మారిపోయిన క్రమంలోనే బంధుత్వాలు కూడా దూరమైపోతున్నాయి. సమయానికి పెళ్లి వేడుకకు వచ్చి వెళ్లిపోతున్న బంధుత్వాలే కనిపిస్తున్నాయి. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతలు, అన్నదమ్ముల ఆనందాలు, బావ మరదళ్ల చిలిపిమాటలు, వదిన మరదళ్ల సరదాలు, మామ, తాత, బావ, మనవడు ఇలాంటి పిలుపులే ఇప్పుడు పెళ్లిల్లో వినిపించకుండాపోతున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్నా ఆప్యాయతలను మాత్రం హృదయాల్లో నిలుపుకోలేకపోతున్నారు.