శివోహం..
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:49 AM
మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి జిల్లాలోని భక్తులు సిద్ధమయ్యారు. అర్ధరాత్రివేళను శివలింగోద్భవ కాలమని శాస్త్రం చెబుతుంది. బుధవారం మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వేడుకలు ప్రారంభం అయ్యాయి. దేవాలయాల వద్ద క్యూలైన్లు, చలువ పందిళ్లు వేశారు.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి జిల్లాలోని భక్తులు సిద్ధమయ్యారు. అర్ధరాత్రివేళను శివలింగోద్భవ కాలమని శాస్త్రం చెబుతుంది. బుధవారం మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వేడుకలు ప్రారంభం అయ్యాయి. దేవాలయాల వద్ద క్యూలైన్లు, చలువ పందిళ్లు వేశారు. దేవాలయాల వద్ద జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో అన్ని పండుగలు పగలు జరుపుకుంటారు. రాత్రి సమయాల్లో జరుపుకునే ముఖ్య పండుగల్లో దీపావళి, ఆ తర్వాత శివరాత్రి మాత్రమే. శివరాత్రి రోజున ప్రతి శివభక్తుని హృదయంలో శివనామం ప్రతిధ్వనిస్తుంది. శివరాత్రి పర్వదినాల్లో శివదీక్షాపరుల భక్తి ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. శైవ క్షేత్రంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ముక్తి కలుగుతుందని చెబుతారు. శివరాత్రి జాగరణ మానవ జీవితాలను కష్టాల నుంచి పరిహారం చేసి ముక్తిదాతగా వరాలను కురిపిస్తుందనే నమ్మకం ఉండడంతోనే శివరాత్రిని అతి పవిత్రంగా జరుపుకుంటారు.
ఫ గోగుపువ్వే శివరాత్రికి శ్రేష్ఠం..
భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. శివ భక్తులు ఉపవాస దీక్షతో శివున్ని కొలిచే క్రమంలో తెలంగాణలో ప్రధానంగా గోగుపువ్వు లేకుండా గండదీపం ముట్టించరు. మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండడంతో పాటు రాత్రి వేళ శివాభిషేకాలను, పూజలు చేయడంతో పాటు జాగరణ చేస్తారు. నాలుగు రకాలైన అభిషేకాలతో శివున్ని పూజిస్తారు. మొదటి జాములో శివున్ని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజ జరిపిస్తారు. రెండో జాములో పెరుగు, తులసీ దళాలతో, మూడో జాములో నెయ్యితో, మారేడు దళంతో, నాలుగో జాములో తేనెతో, పాలశపుష్పములతో పూజిస్తారు. అయితే శివున్ని పూజించే వారు సకల సౌఖ్యాలతో పుణ్య ఫలాలను పొందుతారని నమ్మకం. ఇందులో శివుడు తనను పూజించే భక్తులు సువాసన వెదజల్లని పాలశ పుష్పాలనే కోరాడని, భక్తులు శివరాత్రి పర్వదినాల్లో లభించే తొలి పుష్పాల్లో కేవలం సువాసన వెదజల్లని మోదుగుపూలు (గోగుపూలు) గుర్తించి శివునికి పూజించారని పండితులు చెబుతున్నారు. తెలంగాణలో పాలశపుష్పాలుగా గోగుపూలనే భక్తులు గండదీపం చుట్టూ ఉంచి ప్రత్యేక పూజలు జరుపుతారు.
ఫ అర్ధరాత్రి దాటాక లింగోద్భవ దర్శనం..
ప్రతి శివాలయంలో శివరాత్రిని అతి పవిత్రంగా భక్తి తన్మయత్వంలో జరుపుకుంటారు. శివరాత్రి రోజు స్వామి లింగోద్భవుడై భక్తులను అనుగ్రహిస్తాడని విశ్వాసం. జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రంతో పాటు జిల్లా కేంద్రంలోని శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షలో ఉండే భక్తులు శివాలయాలను సందర్శించి స్వామివారికి పూజలు చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి నిత్య పూజ కార్యక్రమాలతో పాటు ఉదయం 5 గంటలకు శ్రీ విఘ్నేశ్వర పూజ, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరంతర జలాభిషేకం, సాయంత్రం 6 గంటలకు అఖండ ధీపారాధన, రాత్రి 12 గంటలకు లింగోద్భవం, రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించనున్నారు. గురువారం శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో శివాలయం, శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంతోపాటు ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి ముస్తాబాద్, వీర్నపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి మండలాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, వేడుకలకు ఏర్పాట్లు చేశారు.