స్వశక్తి మహిళలకు బీమాతో ధీమా!
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:24 AM
స్వశక్తి సంఘాల మహిళలకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రమాద బీమా, లోన్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్వశక్తి సంఘాల మహిళలకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రమాద బీమా, లోన్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీనిపై సెర్ఫ్ సిబ్బంది మహిళా సంఘాలతో నిర్వహించే సమావేశాల్లో అవ గాహన కల్పిస్తున్నారు. ఈ పథకంతో మహిళలకు భరోసా కల్పించినట్లయ్యింది.
మహిళల్లో పొదుపు అలవాటు చేసేందుకు 1992లో అప్పటి కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది. 10 నుంచి 15 మంది సభ్యులతో సంఘాలను ఏర్పాటు చేసి వారిచే పొదుపు చేసే విధానాన్ని అలవాటు చేశారు. నెలకు 50 నుంచి 100 రూపాయల వరకు క్రమం తప్పకుండా ఏడాది నుంచి రెండేళ్ల వరకు పొదుపు చేసే డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించేందుకు ఒక్కో సంఘానికి రూ.10 వేల చొప్పున సహాయాన్ని అందించారు. ఆ డబ్బులతో సంఘాల మహిళలు స్వయం ఉపాధి పను లు చేసుకునేలా ప్రోత్సహించారు. క్రమంగా మహిళల్లో పొదుపు చేయడం అలవాటుగా మారడంతో ఆ సం ఘాల ద్వారా మహిళలు కుటుంబాలనే పోషించే స్థాయికి ఎదిగారు. గ్రామాలే గాకుండా పట్టణాల్లోనూ మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. డ్వాక్రా సం ఘాలు కాస్త మహిళా సంఘాలుగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్యారంటీగా ఉండి బ్యాంకు రుణాలు ఇప్పిం చింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పావలా వడ్డీకే బ్యాంకు లింకేజీ రుణాలను ఇప్పించారు. ఆ తర్వాత 2012లో కిరణ్ కుమార్‌రెడ్డి సీఎం అయిన తర్వాత జీరో వడ్డీకే బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చారు. రెగ్యులర్‌గా రుణాలు చెల్లించే మహిళా సంఘాలకు ప్రతీ ఆరు మాసాలకోసారి వారి ఖాతాల్లో వడ్డీ సొమ్మును జమ చేశారు. బ్యాంకు రుణాలే గాకుండా స్త్రీనిధి బ్యాంకును ప్రభుత్వం ఆరంభించి తద్వారా మహిళలకు వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. ఏదేని కారణంగా రుణాలు పొందిన మహిళలు సాధారణంగా, ప్రమాదవశాత్తు మరణించినా వారు తీసుకున్న రుణాలు మాఫీ అయ్యేవి కావు. తప్పరిసరిగా కుటుంబ సభ్యులు చెల్లించాల్సిందే.
ఇందిరా మహిళా శక్తి పథకంతో బీమా..
ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ఐదేళ్లలో మహిళలకు కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకవచ్చింది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పనులు చేసుకునేందుకు మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా జీరో వడ్డీకే రుణాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ రుణాలు ఇప్పిస్తున్నారు. అలాగే స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారందరికీ ప్రమాద బీమా సౌకర్యంతో పాటు రుణాలు పొందిన వారందరికీ లోన్ బీమా సౌకర్యాన్ని కల్పించింది.
జిల్లాలో ఏర్పాటైన సంఘాలు
జిల్లాలో సెర్ఫ్, మెప్మా పరిధిలో 19 మండల, పట్టణ సమాఖ్యలు, 668 గ్రామ, స్లమ్ సమాఖ్యలు ఉన్నాయి. వీటి పరిధిలో 16,420 స్వశక్తి మహిళా సంఘాలు ఉండగా, వీటిలో 1,65,778 మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ బ్యాంకు లింకేజీ రుణాలు కల్పించారు. రుణాలు తీసుకున్నా, తీసుకోకున్నా స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ రెగ్యులర్‌గా పొదుపు చేస్తున్న వారందరికీ ప్రభుత్వం రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే భీమా చెల్లించనున్నారు. శాశ్వత అంగవైకల్యం ఉంటే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. రుణాలు పొందిన వాళ్లు సహజ మరణం పొందినా, ప్రమాదశాత్తు మరణించినా లోన్ బీమా కింద వారు బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న రుణం రూ.5 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం సంబంధిత బ్యాంకుకు చెల్లిస్తుంది. ఈ పథకాన్ని స్త్రీనిధి బ్యాంకు అమలు చేస్తున్నది. మరణించిన వాళ్లు సంఘ సభ్యురాలై ఉం డాలి, వారి బ్యాంకు ఖాతా పుస్తకం, సంఘంలో సభ్యు రాలైనట్లు సంఘం తీర్మానం కాపీ, మరణ ధ్రువీకరణ పత్రం, ఎఫ్‌ఐఆర్, తదితర ధ్రువీకరణ పత్రాలు సెర్ఫ్ సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. అంగవైకల్యం పొందిన వాళ్లు 50 శాతం అంగవైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్త్రీనిధి బ్యాంకు ఆర్‌ఎం దుర్గాప్రసాద్ తెలిపారు. లోన్ బీమా ద్వారా రుణాలు పొందిన వాళ్లు చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని 2 లక్షల వరకు సంబంధిత బ్యాంకుకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 80 మంది వరకు మహిళలు మృతి చెందారని, ఇందులో 12 మంది ప్రమాదవశాత్తు మరణించారని, వీరికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రభుత్వానికి పంపిస్తున్నామని దుర్గా ప్రసాద్ తెలిపారు. ప్రమాద, లోన్ బీమాలు తమకు ఎంతగానో భరోసా కల్పిస్తున్నాయని మహిళలు చెబుతున్నారు.