Share News

ప్రచారానికి తెర

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:51 AM

పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరోవైపు ప్రలోభాలకు తెరలేచింది. కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలపించే విధంగా మారడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

ప్రచారానికి తెర

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరోవైపు ప్రలోభాలకు తెరలేచింది. కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలపించే విధంగా మారడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టభద్రుల స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఫ హోరాహోరీగా ప్రచారం

ఈసారి అభ్యర్థులందరూ నాలుగు నెలల ముందు నుంచే ఓటర్లను చేర్పించడంపై దృష్టి పెట్టారు. దీంతో పట్టభ్రదుల ఎమ్మెల్సీ స్థానంలో 3,55,189 మంది, ఉపాధ్యాయ స్థానంలో 27,088 మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్లను చేర్పిస్తూనే ప్రచారంపై దృష్టి పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, మండలాల వారీగా, నియోజకవర్గాల వారిగా వృత్తులవారీగా సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ తరుపున ముఖ్యమంత్రితోపాటు ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరుపున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. ఇరు పార్టీలు కొన్ని ప్రాంతాల్లో 25 మంది ఓటర్లకు, మరికొన్ని చోట్ల 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామస్థాయి కమిటీలు ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. వారే ఆ ఓటర్లను గరువారం జరుగనున్న పోలింగ్‌కు హాజరై ఓటు వేయించుకునేలా ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వం ముగిసింది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు, శ్రే ణులు మిగిలిన రెండు రోజుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఫ ప్రలోభాల పర్వం ప్రారంభం

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సంబంధించి ఒక అభ్యర్థి ఓటరుకు 5వేల రూపాయల చొప్పున, మరో అభ్యర్థి 3వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పంపిణీ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తున్నది. ఒక్కో అభ్యర్థి తనకు సానుకూలంగా ఉండే ప్రాంతాల్లో ఓటర్లను గుర్తించి నియోజకవర్గం మొత్తంగా లక్ష నుంచి లక్షన్నర మందికి వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు పంపిణీ చేసేందుకు ముందస్తుగానే ఏర్పాట్లు చేశారనే ప్రచారం జరుగుతోంది. పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీ పడుతున్నా కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది.

Updated Date - Feb 26 , 2025 | 01:51 AM