తగ్గిన చికెన్ అమ్మకాలు
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:17 AM
బర్డ్‌ఫ్లూ ప్రభావంతో జిల్లాలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు లేకున్నా ఇతర జిల్లాల్లో వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ తినడం తగ్గించేశారు. ఎక్కువ ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అధికారులు చెబుతున్నా.. ఈ పరిస్థితుల్లో తినకపోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు.
గణేశ్‌నగర్,ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బర్డ్‌ఫ్లూ ప్రభావంతో జిల్లాలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు లేకున్నా ఇతర జిల్లాల్లో వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ తినడం తగ్గించేశారు. ఎక్కువ ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అధికారులు చెబుతున్నా.. ఈ పరిస్థితుల్లో తినకపోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఏరియాల్లో హోల్‌సేల్ వ్యాపారులు రోజుకు నాలుగైదు క్వింటాళ చికెన్ విక్రయించేవారు. వారం రోజులుగా ప్రజలు చికెన్ తినడం తగ్గించడంతో సగానికిపైగా అమ్మకాలు తగ్గాయి. జిల్లా కేంద్రంలోని హాస్టల్స్, హోటల్స్‌లో కూడా చికెన్ వండడం తగ్గించారని, దీంతో తమ అమ్మకాలు తగ్గిపోయాయని వారు చెబుతున్నారు.
ఫ శుభకార్యాల్లో మటన్‌కు ప్రాధాన్యం
శుభ కార్యాల్లోనూ చికెన్ స్థానంలో మటన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కిలో చికెన్ ధర 240 నుండి 180 రూపాయలకు పడిపోయింది. అయినా ఎవరు కొనడం లేదు. అకస్మాత్తుగా విక్రయాలు తగ్గిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉండడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. దుకాణాల అద్దె, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలకు ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్ల విక్రయాలు 40 నుంచి 50 శాతం మేర పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గుడ్డు ధర ఇదివరకు ఆరు నుంచి ఏడు రూపాయల వరకు అమ్మగా ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు రూపాయలకు పడిపోయాయి. జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని పాలీ్ట్రలపై దృష్టి పెట్టామని, జిల్లాలో ఇప్పటివరకు వైరస్ ఆనవాళ్లు లేవంటున్నారు. చికెన్ అమ్మకాలు తగ్గి మటన్, చేపల అమ్మకాలు పెరిగాయి.
ఫ అమ్మకాలు తగ్గాయి
- గుడిపాటి శ్రీనివాసరెడ్డి, చికెన్ సెంటర్ యజమాని
వారం రోజులు చికెన్ ధరలు, అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. గతంలో ప్రతిరోజు 50 కిలోల చికెన్ అమ్మేవాడిని. ఇప్పుడు ఐదు కిలోలకు మించి అమ్ముడవడం లేదు. ఎక్కడో కోళ్లకు వైరస్ వస్తే ఇక్కడ కోళ్లకు వైరస్ వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. మంచిగా ఉడకబెట్టిన చికెన్, గుడ్లు తినొచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పినా ప్రజలు నమ్మడంలేదు.
ఫ జీతాలు చెల్లించడం భారంగా మారింది
హమ్జద్, చికెన్ సెంటర్ యజమాని
ప్రతిరోజు మూడు, నాలుగు క్వింటాళ్ల చికెన్ అమ్మకాలు జరిగేవి. బర్డ్‌ఫ్లూ భయంతో అమ్మకాలు తగ్గాయి. ప్రస్తుతం 50 కిలోలు కూడా అమ్ముడవడం లేదు. నా వద్ద ఏడుగురు పని చేస్తున్నారు. వారికి జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు.