‘రామగుండం’లో డివిజన్ల పునర్విభజన
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:02 AM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడు గ్రామాల విలీనానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది.

కోల్‌సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడు గ్రామాల విలీనానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్ గ్రామ పంచాయతీ, అంతర్గాం మండలం కుందనపల్లిలోని అక్బర్‌నగర్ ఏరియా, రామగిరి మండలం వెంకట్రావ్‌పల్లి గ్రామ పంచాయతీలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయనున్నారు. ఈ మూడు ప్రాంతాలు భౌగోళికంగా నగరంలోనే ఉంటాయి. కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అక్బర్‌నగర్‌కు రెండు వైపులా కార్పొ రేషన్ ప్రాంతాలే ఉంటాయి. ముందు రైల్వే కాలనీ, పక్కన రామగుం డం స్టేషన్ ఏరియాలు ఉంటాయు. అలాగే రామగిరి మండలం వెంకట్రావ్‌పల్లి యైుటింక్లయిన్‌కాలనీ పట్టణంలోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్‌తో పాటు సమీప క్వార్టర్లన్నీ వెంకట్రావ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయి. అలాగే ఎల్కలపల్లి గేట్ ఎదురు ప్రాంతమంతా మున్సిపల్ కార్పొ రేషన్‌లోనే ఉంటుంది. ఈ గ్రామపంచాయతీ పరిధి లో గ్రామీణ వాతా వరణం లేదు. దీంతో ఈ మూడు ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిసర గ్రామాలను కార్పొరేష న్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.
గతంలో ఐదు గ్రామాల విలీన ప్రతిపాదనలు
గతంలో ఐదు గ్రామాలు కార్పొరేషన్‌లో విలీన ప్రతిపాదనలు జరుగ గా మళ్లీ ఉపసంహరించుకున్నారు. అనంతరం పరిణామాల్లో ఆయా గ్రామాలకు ఎన్నికలు కూడా జరుగలేదు. ఐదేళ్లుగా పాలకవర్గాలు లేకుండా ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగాయి. ఈసారి కేవలం కార్పొరేషన్ పరిధిలో పక్కనే ఉన్న మూడు ప్రాంతాలను మాత్రమే కార్పొరేషన్‌లో విలీన ప్రతిపాదన చేశారు. రామగుండం పక్కనే ఉన్న పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌ను కూడా విలీ నం చేసేందుకు జిల్లా యంత్రాంగం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లింగాపూర్, రాయదండి గ్రామాలకు సంబంధించి గతంలో ప్రతిపాద నలు ఉన్నా ప్రస్తుతానికి వాటిని పక్కన పెట్టారు.
పునర్విభజన అనివార్యం..
1982 జనవరి 1వ తేదిన రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ప్రభు త్వం ఏర్పాటు చేసిన ప్రాంతమే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉంది. ఇందులో ఎక్కడా కూడా విలీనాలు జరుగలేదు. 139చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల కార్పొరేషన్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,29,644జనాభా ఉంది. ప్రస్తుతం జనాభా 2.7లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్పొరేషన్‌లో 63వేల నివాసాలు ఉండగా 50 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల సందర్భంగా డివిజన్ల పునర్విభజన జరిగినా భౌగిళిక పరిస్థితుల కారణంగా హేతుబద్దత కొరవడింది. కొన్ని డివిజన్లలో 7నుంచి 8వేల ఓట్లు ఉండగా, కొన్ని డివిజన్లలో 3వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. కార్పొరేషన్‌లో పది డివిజన్లు పెంచాలని శాసన సభ్యుడు రాజ్‌ఠాకూర్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. కార్పొరేషన్‌లో ప్రస్తుత ప్రాంతంతో పాటు ఎల్కలపల్లి గేట్, కుందన పల్లి అక్బర్‌నగర్, వెంకట్రావ్‌పల్లి గ్రామాలు విలీనమవుతుండడంతో వైశాల్యం, జనాభా పెరుగనున్నది. ఒక వెంకట్రావ్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోనే 8వేల జనాభా ఉండగా, ఎల్కలపల్లి గేట్ గ్రామపంచాయతీలో 2వేల జనాభా, కుందనపల్లి అక్బర్‌నగర్‌లో ప్రస్తుత అంచనా ప్రకారం 2200లకుపైగా జనాభా ఉంది. ఎల్కలపల్లి గేట్ గ్రామ పంచాయతీ పరిధిలో 480ఓట్లు, అక్బర్‌నగర్‌లో 920, వెంకట్రావ్‌పల్లిలో 3706 ఓట్లున్నాయి. కార్పొరేషన్ లో గ్రామాల విలీనం, డివి జన్ల సంఖ్య పెంపునకు సంబంధించి జీవో విడుదల కాగానే డివిజన్ల పునర్విభజన జరుగనున్నది. పునర్విభజన నిబంధనలు అనుసరించి భవిష్యత్‌లో అభివృద్ధి చెందనున్న ప్రాంతా లను పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేయనున్నారు. పునర్విభజ న తరువాత రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
ఆశావాహుల్లో ఉత్కంఠ..
రామగుండం నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ఈ నెల 27తో ముగియనున్నది. త్వరలోనే పాలకవర్గానికి ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలపరిమితిపై రిజర్వేషన్లు ఏర్పాటు చేయగా ఈసారి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఐదేళ్లకు కుదించారు. మున్సిపాలిటీ లకు కూడా ఇదే విధానం అమలు కానున్నది. కానీ కార్పొరేషన్‌లో పునర్విభజన జరిగితే డివిజన్ల హద్దులు, పరిధిలు కూడా మారే అవకాశం ఉన్నది. దీంతో ఆశావాహులు ఏయే ప్రాంతాలు తమ పరిధిలోకి వస్తాయి, ఏవీ రావనే ఆలోచనలో పడ్డారు.