పరిషత్ ఎన్నికలకు కసరత్తు
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:13 AM
జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జగిత్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో ముందుగా గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం వాటికి కాకుండా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ గుర్తులతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉండాలనే దానిపై అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. కొత్తగా ఏర్పాటైన మండలాలు, పక్క మండలాల నుంచి కలిసిన గ్రామాలను పరిగణనలోకి తీసుకొని మండలాల వారీగా ఎంపీటీసీల సంఖ్యను నిర్ణయిస్తున్నారు. మండల పరిషత్‌ల సంఖ్య 18 నుంచి 20కి చేరింది. గతంలో 214 ఎంపీటీసీ సభ్యుల స్థానాలుండగా ప్రస్తుతం వీటి సంఖ్య 227కు చేరింది. ఈ లెక్కలు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు అందజేసినట్లుగా సమాచారం.
ఫప్రస్తుతం ప్రత్యేక పాలన
గత యేడాది జనవరి 31న సర్పంచ్‌ల పదవీ కాలం ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం అనివార్య కారణాలతో వాయిదా వేసింది. జిల్లాలో 214 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా వారి పదవీ కాలం గత యేడాది జూలై 3వ తేదీతో ముగిసింది. జిల్లాలో 18 మంది జడ్పీటీసీ సభ్యులుండగా వారి పదవీ కాలం కూడా ఒక్క రోజు తేడాతో అంటే జూలై 4వ తేదీతో ముగిసింది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ బాధ్యతలను ప్రత్యేకాధికారులకు అప్పగించారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో దేనికీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని, బీసీ కమిషన్ నివేదికతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. అయితే అది కాస్తా పక్కన బెట్టిన ప్రభుత్వం తాజాగా పరిషత్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీంతో ప్రస్తుతం అందరీ దృష్టి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై పడింది.
కొత్త మండలాల్లో...
జిల్లాలో 2019లో జరిగిన ఎన్నికల్లో 18 మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన బీమారం, ఎండపల్లి మండలాల్లో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మండల పరిషత్‌ల సంఖ్య 18 నుంచి 20కి చేరింది. గతంలో 214 ఎంపీటీసీ సభ్యుల స్థానాలుండగా ప్రస్తుతం వీటి సంఖ్య 227కు చేరింది. జగిత్యాల జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి ఎండపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి మేడిపల్లి మండలం పరిధిలోని కొన్ని గ్రామాలతో బీమారం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెండు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు, రెండు జడ్పీటీసీ స్థానాలు, రెండు ఎంపీపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.