Peddapalli : ఖని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:32 AM
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

మరమ్మతు పనులను వేగవంతం చేయాలి...
కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటి అంతస్థులోని ఫ్లోరింగ్, రినోవేషన్ పనులను వేగవంతం చేయాలని, రోగులను ఇతర బ్లాకులకు తరలించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో ఫ్లోరింగ్ రెనోవేషన్ పనులను సంబంధిత ఏజెన్సీలకు అప్పగించాలని, ఫ్లోరింగ్ పనులు ముగిసిన వెంటనే మరో విభాగానికి అప్పగించి ప్రణాళిక ప్రకారం పనులు త్వరితగత పూర్తయ్యేలా చూడాలన్నారు. అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు, శస్త్ర చికిత్సలు, అవుట్ పేషెంట్ల వివరాలను తెలుసుకున్నారు. పెయింగ్ రూమ్, రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్, అవుట్ పేషెంట్ వివరాలను పరిశీలించి ఆసుపత్రి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పడకల సంఖ్య పెరిగినందున రోజూ ఓపీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా రోగులకు వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరిపైనా దురుసుగా ప్రవరిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ హిమబిందు, అర్థో ప్రొఫెసర్ రాజు ఉన్నారు.