రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:06 AM
ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
- ప్రఽభుత్వ ప్రధాన వైద్యశాల ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల టౌన్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోస్టర్‌లో ఎంత మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. ఆసుపత్రిలో ఏమైన ఇబ్బందులు ఉన్నాయా అని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో ప్రస్తుతం ఎంత మంది పేషెంట్లు ఉన్నారు.. వారికి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో లివర్ సమస్యతో బాధపడుతున్న ఓ రోగి కుటుంబసభ్యులు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న మెరుగుపడడం లేదంటూ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన కలెక్టర్ రోగి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకొని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు పంపించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ, జనరల్, ప్రసూతి, ఆర్థో, పిడియాట్రిక్, సర్జికల్ వార్డులతో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు. రోగులను అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనారోగ్యాలతో రోగులు సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంతో వస్తారని వారికి అన్ని రకాలుగా భరోసా కల్పిస్తూ మెరుగైన వైద్యం అందించడం వైద్యులు, సిబ్బంది కర్తవ్యమని అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
ఎల్లారెడ్డిపేట, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిరెన్షియల్ విద్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులు, భోజన శాల, మూత్రశాలలు, వంట సామగ్రిని పరిశీలించారు. పరిసరాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు లేకుండా శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి చాక్ పీసు పట్టుకుని లెక్కలు బోధించారు. గణితంలోని విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల బోధన, భోజనం ఏలా ఉంటుందని ప్రశ్నించారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.