Share News

Local Body Elections: వారికి ఇంటి నుంచి ఓటు లేనట్లేనా!

ABN , Publish Date - Dec 08 , 2025 | 07:17 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్టు పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచి ఓటు అవకాశం ఇవ్వలేదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో ఓటర్లకు, కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Local Body Elections: వారికి ఇంటి నుంచి ఓటు లేనట్లేనా!
Local Body Elections

  • అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం

  • పంచాయతీ ఎన్నికల్లో స్పష్టత కరువు


హుజూరాబాద్‌ రూరల్, డిసెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): రెండేళ్ల క్రితం నిర్వహించిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. నడవలేని, మంచానికే పరిమితమైన వృద్ధులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేక పోవడంతో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతుంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అటువంటి వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుతం జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేసేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.. ఈసీ నుంచి అలాంటి ప్రకటన రాలేదు.


గత ఎన్నికల్లో ఇలా..

గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరుండి 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా 12-డీ ఫారాన్ని ముందస్తుగానే నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వారు ఇచ్చిన అడ్రస్‌కు పూర్తి స్థాయి భద్రత, పోలింగ్ సామగ్రితో వెళ్లి అధికారులు ఓటు వేయించారు.


ఇబ్బందులు పడే అవకాశం..

ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికలో ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం కూడా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయం లోపు కుటుంబ సభ్యులు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాలి. ఒకవేళ వారిని వదిలేస్తే ఓటింగ్ శాతం తగ్గి గెలుపు, ఓటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతోపాటు ఓటర్లు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రవాస టిబెటన్ల కవిత్వ ప్రతిఘటన

Updated Date - Dec 08 , 2025 | 07:17 AM